ఎన్యూమరేషన్ ఫారాలు అందరికీ అందేలా చూడాలి
గ్రామ, వార్డు స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలి
సమగ్ర అభివృద్ధి వేదిక (SAV) వ్యవస్థాపక అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్
చుంచుపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో ఇప్పటికీ ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందెల చూడాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని సమగ్ర అభివృద్ధి వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. శనివారం చుంచుపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి చాలామందికి ఎన్యుమరేషన్ ఫారాలు చేరలేదని, చాలామంది ఓటర్లకు తమ ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. అటువంటి ఓటర్ల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, వారి ఓటు వివరాలను సులభంగా తెలియజేసే ఏర్పాట్లు చేయాలని కోరారు. లేని పక్షంలో అర్హులైన పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్యూమరేషన్ ఫారంలోని "బంధువు పేరు – బంధుత్వం" కాలమ్‌ల తండ్రి, తల్లి, తాత, నాయనమ్మ లేదా సంరక్షకుడు అనే సంబంధాన్ని స్పష్టంగా నమోదు చేసే విధంగా మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. ఫారాలు నింపే విషయంలో ప్రజల్లో ఇంకా సందేహాలు ఉన్నందున గ్రామ, వార్డు స్థాయిలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని, అవసరమైతే దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘం జిల్లా నాయకులు రాయి మోహన్ రావు, కోశాధికారి బి. వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎస్. సాయిబాబా, సమగ్ర అభివృద్ధి వేదిక నాయకులు కె.వి. సీతారాం తదితరులు పాల్గొన్నారు.






