25 August, 2026 | 2:59 AM

ప్రజావాణిలో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికేనా..?

25-08-2026 12:44 AM

రెండవ వారం ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న అధికారులు 

బెజ్జూర్ ఆగస్టు 24 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో రెండవ వారం ప్రజావాణి కార్యక్రమం మండల నోడల్ అధికారి బండారి ప్రవీణ్ కుమార్ సమక్షంలో నిర్వహించారు. తహసిల్దార్ రామ్మోహన్ రావు, మండల విద్యాధికారి డాక్టర్ సునీత, వ్యవసాయ అధికారి నాగరాజు పలు శాఖల అధికారులు ఇట్టి కార్యక్రమానికి హాజరయ్యారు.

పలు గ్రామ పంచాయతీల ప్రజలు 6 ఆర్జీలను అధికారులకు అందజేశారు. సులుగుపల్లి గ్రామ ప్రజలు గిరిజన మత్స్యశాఖ ఏర్పాటు కోసం ఎన్‌ఓసి సర్టిఫికెట్ కోసం గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్పంచ్ ఇవ్వడం లేదని ప్రజావాణిలో దరఖాస్తు అధికారులకు అందించినట్లు గ్రామ ప్రజలు తెలిపారు.

బెజ్జూర్ తదితర గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్యపై విద్యుత్ అధికారికి సమస్య పరిష్కరించాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత మొదటి ప్రజావాణి కార్యక్రమంలో 27 దరఖాస్తులు రాగా, రెండవ వారం 6 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమం లో ప్రజలు అందించిన ఆర్జీలకు పరిష్కారం అవుతేనే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి పై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ప్రజలు అంటున్నారు.

గ్రామాలలో నెలకొన్న పలు సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించేలా అధికారులు చూడాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గ్రామాల ప్రజలు అందించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఆయా శాఖల వారీగా నివేదికలు ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తామని తెలిపారు.