10 June, 2026 | 7:53 AM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్‌ఏలకు అవగాహన

10-06-2026 01:17 AM

బోధన్, జూన్ 9 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరి ఓటు హక్కు నమోదు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని బూత్ లెవెల్ ఏజెంట్లకు డీసీసీ అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ నేపథ్యంలో ఓట్ల కూర్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఆయన సూచించారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ విజయవంతం చేయడంలో బూత్ లెవల్ ఏజెంట్లది కీలకపాత్ర అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడటంతోపాటు, జాబితాలో లోపాలు ఉంటే సరిదిద్దేలా సర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అర్హులందరూ జాబితాలో ఉండేలా దృష్టి పెట్టాలని తెలిపారు. నెల రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో కొత్త ఓట్ల చేరికలు, పాత ఓట్ల తొలగింపులను బీఎల్‌ఏలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా ఓటర్లు, అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, ఆదిత్య రెడ్డి, శశాంక్, గంగాశంకర్, పాషా, నాగేశ్వర్ రావు, దాము, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.