జర్నలిస్టుపై రవితేజపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
- దాడిని ఖండించిన టీయూడబ్ల్యూజే హెచ్–143 కో-కన్వీనర్ శ్రీనివాస్
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన ఆర్‌బీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పుల్ల రవితేజపై జరిగిన దాడిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) హెచ్–143 కో-కన్వీనర్ రేనుకుంట్ల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భూ సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ బాధితులు చేపట్టిన ధర్నా, నిరసన దీక్ష కార్యక్రమాన్ని రవితేజ తన వృత్తి ధర్మంలో భాగంగా కవర్ చేసి, బాధితుల ఆవేదనను వార్త రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లారు.
ఆ వార్తను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో రవితేజ ఇంటికి వెళ్లి భౌతిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం అత్యంత దారుణమన్నారు. జర్నలిస్టు ఇంటిపై దాడి అంటే కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రశ్నించే గొంతుపై దాడి అని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను కవర్ చేయడం జర్నలిస్టుల వృత్తి ధర్మమని, బాధితుల సమస్య న్యాయబద్ధమైనదా? కాదా? అనేది సంబంధిత అధికారులు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని, వార్తను కవర్ చేసినందుకు జర్నలిస్టుపై దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని శ్రీనివాస్ పేర్కొన్నారు.
మండల, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా జిల్లా కేంద్రాలు, పెద్ద మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులతో సమానంగా జర్నలిజం స్వేచ్ఛ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. గ్రామంలో రైతు సమస్య, భూ వివాదం, పేదల సమస్య లేదా ప్రభుత్వ కార్యాలయంలో అన్యాయం జరిగినప్పుడు ముందుగా అక్కడికి వెళ్లి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేది స్థానిక విలేకరులేనని తెలిపారు. రవితేజ దళిత జర్నలిస్టు కావడంతో ఈ ఘటనలో సామాజిక కోణాన్ని కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
దాడిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని నిబంధనలు వర్తించే పరిస్థితులు ఉంటే, చట్ట ప్రకారం సంబంధిత సెక్షన్లను నమోదు చేసి చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ కోరారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, దాడికి పాల్పడిన వారెవరైనా, వారికి ఎంతటి రాజకీయ లేదా అధికార పలుకుబడి ఉన్నా చట్టం ముందు నిలబెట్టాలన్నారు. రవితేజకు న్యాయం జరిగే వరకు జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు బాధితుడికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు, వివక్షకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) హెచ్–143 ఎప్పుడు వ్యతిరేకిస్తుందని, జర్నలిస్టులకు అండగా ఉంటుందిని స్పష్టం చేశారు.






