23 June, 2026 | 11:31 AM

ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం

23-06-2026 10:18 AM

రాజోలి పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు 

అలంపూర్: గద్వాల్ జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఇసుక రీచ్‌పై జరిగిన దాడి స్థానికంగా చర్చకు దారితీసింది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లో విధులు నిర్వహిస్తున్న సైట్ ఇంచార్జి ఎల్వీ చౌదరిపై కొందరు వ్యక్తులు సోమవారం దాడికి పాల్పడ్డారని బాధితులుఆరోపించారు.బాధితుల కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రెండు కార్లలో ఇసుక రీచ్‌కు చేరుకుని, సైట్ ఇంచార్జిని ఇనుప రాడ్లతో బెదిరించారు.అనంతరం రీచ్‌కు సంబంధించిన రికార్డు బుక్కులు, నగదు ఉన్న బ్యాగును బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

దాడిలో పాల్గొన్న వారిలో టీడీపీ నాయకుడు ఆడుసుమిల్లి శ్రీధర్ ఉన్నట్లు తాను గుర్తించానని సైట్ ఇంచార్జి ఎల్వీ చౌదరి పేర్కొన్నారు. అలాగే ఈ ఘటన వెనుక హైదరాబాద్‌కు చెందిన గుత్తికొండ ఠాగూర్ ప్రమేయం ఉండొచ్చని బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. దాడి అనంతరం సైట్ ఇంచార్జి, సిబ్బంది రాజోలి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించడంతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాజోలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదాయ వనరుగా ఉన్న ఇసుక రీచ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం