23 June, 2026 | 11:27 AM

కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్

23-06-2026 10:15 AM

ఇల్లందు, (విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తక్కిళ్లపల్లి రవీందర్‌రావులపై ఎమ్మెల్యే కోరం కనకయ్య చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడుకున్నవని మాజీ ఎమ్మెల్యే, ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జి బాణోత్ హరిప్రియ నాయక్ విమర్శించారు. ఇల్లందు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. అభివృద్ధి జరగకపోతే 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన బీ-ఫామ్‌పై ఎందుకు పోటీ చేశారో కోరం కనకయ్య సమాధానం చెప్పాలన్నారు.

ఇల్లందు బస్ డిపో, వంద పడకల ఆసుపత్రి, ఐటీఐ కళాశాల వంటి పలు అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు, ఇల్లందు రైతాంగ సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత పాలనలో జరిగిన పనులపై శ్వేతపత్రంతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన సమయంలో జడ్పీ చైర్మన్ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని కూడా ప్రశ్నించారు. కార్యక్రమంలో సిలివేరి సత్యనారాయణ, దేవిలాల్ నాయక్, జేకే శ్రీను, తోట లలిత శారద, నారాయణమ్మ, పాబోలు కిరణ్, గిన్నారపు రాజేష్, సత్తాల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్ యాదవ్, మీర్జా బేగ్, చాంద్ పాషా, రవికాంత్, బిఫిన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.