ప్రభుత్వ వైఖరిపై వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ అగ్రహం
పట్టా భూములను 22-Aలో చేర్చి ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గం
22-A నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్
భారీ ఎత్తున ధర్నాకు పిలుపు
అమీన్‌పూర్, ఆగస్టు 25: ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పట్టా భూములు ప్రజలకు చెందాలని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలనే ఉద్దేశపూర్వకంగా పట్టా భూములను సైతం 22-A నిషేధిత జాబితాలో చేర్చి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమీన్‌పూర్‌లో గత 30 ఏళ్ల క్రితం వేసిన హెచ్ఎండిఏ (HMDA) లేఅవుట్ భూములతో పాటు ఇతర నివాస ప్రాంతాలను 22-A లో చేర్చడం అత్యంత దారుణమన్నారు. అప్పట్లో హెచ్‌ఎంటీ ఉద్యోగులు కష్టపడి ప్లాట్లు కొనుగోలు చేస్తే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం సీసీఎల్‌ఏ కార్యాలయానికి వెళ్తే అవి 22-A లో ఉన్నాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీనికోసం కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలంటూ సామాన్య ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుతూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమీన్‌పూర్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు జీవితాంతం 20 నుండి 30 ఏళ్లు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే, అత్యవసర సమయాల్లో వాటిని అమ్ముకుందామన్నా 22-A వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్రంగా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఉన్న హెచ్‌ఎంటీ లేఅవుట్ స్థలాన్ని, ఇక్రిశాట్ పక్కన ఉన్న లేఅవుట్లను, పటేల్‌గూడలోని పీపీహెచ్ కాలనీ లేఅవుట్‌లను కూడా 22-A లో పెట్టడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
పీపీహెచ్ కాలనీలో గతంలో హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చిందని, అక్కడ అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇప్పటికే 24 ప్లాట్లలో 20 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు పూర్తయినా, మిగిలిన వాటిని ఇప్పుడు 22-A లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. అధికారుల వద్ద, ప్రభుత్వ రికార్డుల్లో ఏది పట్టా భూమి, ఏది ప్రభుత్వ భూమి అనే స్పష్టమైన వివరాలు ఉన్నప్పటికీ, ప్రజలను మళ్లీ దరఖాస్తులు చేసుకోమనడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలను క్షోభకు గురిచేస్తున్న 22-A నిషేధాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై పెద్ద ఎత్తున అమీన్‌పూర్ నుంచి ధర్నా చేపట్టి ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తామని, బాధిత ప్రజలందరికీ అండగా ఉంటామని అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ స్పష్టం చేశారు.






