ప్రకృతి అమూల్యమైనది, చెట్లు మానవ మనుగడకు ప్రాణాధారం
వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పర్యావరణ సమతుల్యతలో భాగస్వాములు కావాలని పిలుపు
రేగొండ, ఆగస్టు 25( విజయక్రాంతి): ప్రకృతి అమూల్యమైనదని, చెట్లు మానవ మనుగడకు ప్రాణాధారమని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని బుగులోని దేవాలయం సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో మన అడవి, మన భవిష్యత్తు, పచ్చదనం పెంచడం, ప్రాణాలను కాపాడుదాం అనే నినాదంతో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం అనేక కార్యక్రమాలను చేపడుతుందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి, జిల్లా అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






