25 August, 2026 | 1:01 PM

22A భూముల బాధితులకు అండగా గులాబీ దళం

25-08-2026 12:14 PM

ఆగస్టు 29న అమీన్ పూర్ వేదికగా పోరుబాట

 తన్నీరు హరీష్ రావు రాక, 15 వేల మందితో భారీ నిరసన సభ

పటాన్ చెరు, ఆగస్టు 25(విజయక్రాంతి): పటాన్ చెరు నియోజకవర్గంలో 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్స్, ప్లాట్ల బాధితులకు అండగా నిలిచేందుకు గులాబీ దళం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్ పూర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

మంగళవారం ఉదయం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో నియోజకవర్గం పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులతో నిరసన కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..22A భూముల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయనస్పష్టం చేశారు.

రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టుకొని ఇల్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి బతుకులను 22A నిషేధిత భూముల పేరుతో సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు మీదకు తీసుకుని వచ్చిందని వాపోయారు. నియోజకవర్గం వ్యాప్తంగా 22A జాబితా కారణంగా భూముల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు అండగా బిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోందని తెలిపారు. భూమి అనేది ప్రతి కుటుంబానికి అత్యంత విలువైన ఆస్తి అని, సంవత్సరాలుగా తమ భూములను సాగు చేసుకుంటూ, ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న అనేక కుటుంబాలు 22A జాబితా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఈ నెల 29, శనివారం అమీన్ పూర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు.  సుమారు 15 వేల మంది నిరసన సభకు హాజరు కానున్నట్లు తెలిపారు.అర్హత ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నిరసన సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, 22A భూముల బాధితులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.