27 July, 2026 | 2:03 AM

ఇకనైనా మా బకాయిలు చెల్లించండి

27-07-2026 12:00 AM

తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 

ముకరంపుర జూలై 26(విజయ క్రాంతి)ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల,కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన కార్మికులు మరియు ఉద్యోగులకు రావాల్సిన వేతన సవరణ మరియు ఇతర బకాయిల చెల్లింపులపై కరీంనగర్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జోన్ అధ్యక్షులు ఓరుగంటి రమణారావు మాట్లాడుతూ 2017లో జరగాల్సిన పే రివిజన్ను 7 సంవత్సరాల ఆలస్యంతో 2024లో చేపట్టారు.అలాగే 2021లో జరగాల్సిన మరో పే రివిజన్ను 5 సంవత్సరాల ఆలస్యంగా 2026లో అమలు చేశారు.ఈ ఆలస్యం వల్ల సాధారణ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

దాదాపు 15,000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు పే స్కేల్ రివిజన్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.ఈ బకాయిలు అందకుండానే ఇప్పటికే సుమారు 300 నుండి 350 మంది ఉద్యోగులు చనిపోయారని పేర్కొన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్మును అనుభవించకుండానే చనిపోవడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం నుంచి ప్రతి ఉద్యోగికి దాదాపు 6 లక్షల నుండి 10 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందన్నారు.ఈ బకాయిలు దాదాపు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, కేవలం వీటి వడ్డీతోనే ప్రభుత్వం గడపవచ్చని విమర్శించారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించకపోతే, ఆగస్టు 4న బస్ భవన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు