కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆషాఢ గోరింటాకు పండుగ
కోటపల్లి,(విజయక్రాంతి): ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ఆషాఢ గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమిరెల్లి మధునయ్య, వార్డెన్ భవాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు గోరింటాకు ఆకులతో తయారు చేసిన సహజ గోరింటాకును చేతులకు పెట్టుకొని సంప్రదాయాన్ని చాటుకున్నారు.
గోరింటాకు పండుగ విశిష్టత, మన సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యతను విద్యార్థినులకు వివరించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేశారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థినుల్లో మన సంప్రదాయాలు, సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు, ఐక్యత, సృజనాత్మకత, ఆనందాన్ని పెంపొందించవచ్చని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని ఆషాఢ గోరింటాకు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.






