8 August, 2026 | 10:40 PM

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌.. దొంగకు పోలీసుల చెక్‌

08-08-2026 09:32 PM

వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్‌

మంథనిలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ ఎం. రమేష్‌

మంథని రామగిరి,(విజయక్రాంతి): తాళం వేసి ఉన్న ఇళ్లను పగటిపూట రెక్కీ చేసి, రాత్రివేళ తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదును దొంగిలిస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్‌ పర్యవేక్షణలో మంథని సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, రామగిరి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి జగిత్యాల జిల్లాకు చెందిన వనం రామును అదుపులోకి తీసుకున్నారు.

మంథనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఎం. రమేష్‌ కేసు వివరాలను వెల్లడించారు. రామగిరి ఎస్సై టి. శ్రీనివాస్‌ తన సిబ్బందితో శనివారం గస్తీ నిర్వహిస్తున్న సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలిస్తూ అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు.

పోలీసులను చూసి నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద బటన్‌ కత్తి లభించినట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేసేందుకు వచ్చినట్లు అంగీకరించడంతో పాటు, గతంలో తన సహచరులతో కలిసి పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు వెల్లడించినట్లు తెలిపారు.

కల్వచర్ల, రత్నాపూర్, జూలపల్లి, ఓడేడు, ముత్తారం, ధర్మారం, పత్తిపాక తదితర గ్రామాల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు ఏసీపీ ఎం. రమేష్‌ తెలిపారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, గత చోరీలకు సంబంధించిన దొంగిలించిన ఆస్తి రికవరీతో పాటు ఇతర నిందితుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ వెల్లడించారు.

నేరస్థులపై ఉక్కుపాదం

తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఏసీపీ ఎం. రమేష్‌ స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన మంథని సీఐ బి. స్వామి, రామగిరి ఎస్సై టి. శ్రీనివాస్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ భార్గవ్‌, కానిస్టేబుళ్లు డి. రమేష్‌, వి. అభిషేక్‌, బి. రాజ్‌కుమార్‌లను ఏసీపీ ఎం. రమేష్‌ అభినందించారు.