ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, మే 11:జిల్లాలో ఈనెల 13 నుండి 21 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వానస్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఇంటర్ అడ్వానస్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.
జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 13,862 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, అందులో మొదటి సంవత్సరం పరీక్షలకు 9,591 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,271 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని, ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి పరీక్షా కేంద్రంలో రక్షిత మంచినీటి సదుపాయం, పరిశుభ్రమైన వాతావరణం, తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరామ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






