తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమిస్తాం
- అందుకు టీఆర్‌ఎస్ బాధ్యత తీసుకుంటుంది
- నెల రోజుల పాటు పార్టీ జెండా పండుగ
- తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి) : తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘జెండా పండుగ’ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల నుంచి మొదలుకొని మండల, గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాలు ఎగురవేసి, పార్టీ ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ మళ్లీ వంచనకు గురవుతోందని, వలస పాలన నాటి దుష్పరిణామాలను నేడు మళ్లీ ఎదుర్కొంటున్నామన్నారు.
అందుకే తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెలంగాణ రక్షణ సేన బాధ్యత తీసుకొని ఉద్యమిస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడి పన్నెండున్నరేళ్లు గడిచిన సరే ఇంకా వలస పాలన నాటి దుష్పరిణామాలే ఇప్పటికీ కనిపిస్తున్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు మారుతాయని అనుకున్న ప్రతివర్గం కూడా ఇప్పడు తీవ్ర నిసృహాలో ఉందని విచారం వ్యక్తం చేశారు.
స్వరాష్ట్ర సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన మనమంతా కూడా ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ ఆవిర్భానికి మూడు నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున చేరిన నాయకత్వంతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు సమన్వయంతో జెండా పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






