22 July, 2026 | 2:47 AM

సాదా బైనామా, భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

22-07-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,జూలై 21(విజయ క్రాంతి): సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు లతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఆర్డీవో లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతిలో వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాదా బైనమాల క్రమబద్ధీకరణ క్రింద దరఖాస్తు చేసుకున్న వాటిని రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని తెలిపారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులు చాలా మండలాల్లో ఇంకా పెండింగ్ దశలో ఉన్నాయని, తిరస్కరించే దరఖాస్తులను తిరస్కరణకు గల కారణాలు నమోదు చేయాలని తెలిపారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఈనెల 25 లోగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ, ఎ.ఎస్.డి. జాబితాను రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు లోకేశ్వర్ రావు, చెన్నూరి కిష్టయ్య, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.