12 August, 2026 | 10:49 PM

ఆగస్టు 31లోగా చేయూత పింఛన్లకు దరఖాస్తులు

12-08-2026 09:25 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): చేయూత సామాజిక భద్రత పింఛన్ల పథకం కింద అర్హులైన కొత్త లబ్ధిదారుల నుంచి ఆగస్టు 31లోగా దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసీ నుండి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ అనంతరం మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా, డయాలసిస్ బాధితులు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఇప్పటికే ప్రజాపాలన, 99 రోజుల కార్యాచరణ, గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ కార్యాలయాల్లో, పట్టణాల్లో వార్డు అధికారి, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. అన్ని ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో చేయూత సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జలసిరి కింద ఫామ్ పాండ్ల నిర్మాణాలను రెండు వారాల్లో పూర్తి చేయాలని, ఇంకుడు గుంతలు, పెర్కొలేషన్ ట్యాంకులు, బోర్‌వెల్ రీఛార్జ్ పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, ఎక్సైజ్ ఈఎస్ కిరణ్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ వెంకటరత్నం, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.