23 March, 2026 | 8:47 AM

అశ్వారావుపేట పరిధిలోనే ఆయిల్ పామ్ రిఫైనరీ ఏర్పాటు చేయాలి

23-03-2026 12:14 AM

దమ్మపేట, మార్చి 22,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆయిల్ పామ్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ ప్రెసిడెంట్ తుంబూరు మహేశ్వరరెడ్డి, సెక్రటరీ కొక్కెరపాటి పుల్లయ్యల ఆధ్వర్యంలో అశ్వారావు పేట మండలం, నారంవారిగూడెం లో గల తెలంగాణ ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయం వద్ద ఆదివారం ధర్నా నిర్వహిం చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ లో గత ఆయిల్ ఇయర్ లో ఇక్కడి రైతులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి, ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకి, తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు.  ఆయిల్ పామ్ రైతుల ప్రధాన డిమాండ్  జిల్లాకి కనీసం ఒక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కట్టాలనే దానిలో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా నేర్మెట్ట లో గంటకు 30 టన్నుల (30TPH) సామర్ధ్యం తో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించటం శుభపరిణామన్నారు.

ఆయిల్ పామ్ రిఫైనరీ ను అశ్వారావుపేట లేక అప్పారావుపేట ఫ్యాక్టరీలలో ఏదో ఒక చోట ప్రారంభించాలనీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఇప్పటికే ఉన్న రెండు ఫ్యాక్టరీల నుండి లక్ష టన్నుల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతున్నదనీ,  కల్లూరుగూడెం ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభమవుతుందని, అత్యధికంగా ప్రస్తుతం ఆయిల్ పామ్ వేస్తున్న ములకలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం,

మణుగూరు లాంటి ప్రాంతాలలో కూడా భవిష్యత్తు లో ఫ్యాక్టరీలు కట్టాల్సిన అవసరం ఉందనీ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో రిఫైనరీ కడితే ఇక్కడి క్రూడ్ ఆయిల్ ను ఇక్కడే ప్రాసెస్ చేస్తే ఆయిల్ ఫెడ్ కు మంచి లాభాలు వస్తాయనీ, ఇక్కడ రిఫైనరీ పెట్టకుండా ఇక్కడి క్రూడ్ ఆయిల్ ను నేర్మెట్ట కు తరలించడాన్ని, తాము వ్యతిరేకరిస్తున్నామన్నారు.

ఇక్కడ నుండి లక్ష టన్నులు క్రూడ్ ఆయిల్ సిద్దిపేట తరలించాలంటే సంవత్సరం లో 4000 ట్యాంకర్లు, కనీసం ఒక్కో ట్యాంకర్ కు 35 వేల నుండి 40 వేలు, సుమారుగా సంవత్సరానికి 16 కోట్లు కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జి చెల్లించాలని,  దానికి బదులు 40 కోట్లతో అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో రిఫైనరీ కట్టడం మంచిదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో మోనో క్రాప్ గా ఆయిల్ పామ్ తోటలు వచ్చి మిగతా పంటలు ఈ ప్రాంతం లో మరో 5 సంవత్సరాలలో కనుమరుగు అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయనీ,

ఈ ప్రాంతం లో వేరే పరిశ్రమలు వచ్చే అవకాశం లేదనీ, గత ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో రిఫైనరీ స్థాపన అమలు జరిపి ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కి, ఈ ప్రాంత యువత కి 1000 ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అశ్వారావుపేట లో గంటకు 60 టన్నుల సామర్థ్యంతో (60TPH) హారిజాంటల్ స్టెరిలైజేషన్ లో కొత్త ఫ్యాక్టరీ కట్టాలనీ డిమాండ్ చేశారు.

అశ్వారావుపేట ఫ్యాక్టరీ 2007 సంవత్సరం లో కట్టబడి, ప్రస్తుతం మెషినరీ పాతబడి, గత సంవత్సరం అనేకసార్లు బ్రేక్డౌన్ అయిందనీ, దాని వలన ఆయిల్ పామ్ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీ 5 టన్నుల కెపాసిటీతో మొదలయి దశలవారీ 30 టన్నులకు పెంచటం వలన లేటెస్ట్ మలేసియా టెక్నాలజీ మెషినరీ ఏర్పాటు చేయడానికి అనుకూలం కాదు కాబట్టి, ఈ ప్రాంతంలో కొత్తగా వేస్తున్న ఆయిల్ పామ్ తోటల విస్తరణ ను దృష్టిలో పెట్టుకొని ఒకే సారి 60 TPH తో కొత్త ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేశారు.

పెద్దగా ఆయిల్ పామ్ విస్తరణ లేని చోట 300 కోట్ల తో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కట్టి, 40కోట్లతో రిపైనరీ కట్టటానికి సిద్ధపడిన ఆయిల్ ఫెడ్ కు గత ఆయిల్ ఇయర్ లో 180 కోట్లు లాభాలు ఇచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 40 కోట్లతో రిఫైనరీ, 60 కోట్లతో అశ్వారావుపేట లో కొత్త ఫ్యాక్టరీ కట్టటం పెద్ద కష్టం కాదన్నారు. పామాయిల్ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు రిఫైనరీ, అశ్వారావుపేట లో కొత్త పామాయిల్ ఫ్యాక్టరీని స్థాపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.