9 August, 2026 | 3:13 AM

నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి

09-08-2026 12:30 AM
  1. హైడ్రా డ్రైవర్ పోస్టుల భర్తీకి వస్తే అవమానిస్తారా?
  2.  రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్ అయింది
  3.  విద్యార్థులు, నిరుద్యోగులంటే ప్రభుత్వానికి ఎందుకంత కక్ష
  4.  మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): హైడ్రా డ్రైవర్ పోస్టుల భర్తీకి వచ్చిన నిరుద్యోగులను అవమానిస్తారా, నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని, ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.

ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ వేదికగా హరీశ్‌రావు స్పందిచారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారని, ఇది నిరుద్యోగుల తప్పా? లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన మీ ప్రభుత్వం తప్పా? అని నిలదీశారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులను సీఎం స్థాయిలో క్రిమినల్ వేస్ట్ అని అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం చూస్తుంటే యథా రాజా.. తథా అధికారులు అన్న సామెత గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. అధికారుల నోటివెంట ఇలాంటి మాటలు రావడం మరింత బాధాకరమన్నారు.

ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారినే అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, 32 నెలలు దాటింది, ఆ హామీ ఏమైంది? అని నిలదీశారు. రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఇలా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నీ రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్.. నీ జాబ్ క్యాలెండర్ బోగస్.. నిరుద్యోగులకు నువ్వు ఇచ్చిన హామీలు బోగస్’ అని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో నిరాశ పెరుగుతోందన్నారు. నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడంతో పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్య చదివిన యువత కూడా చిన్నచిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఏకంగా విద్యార్థులపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిని నిరుద్యోగులు జాలి అడగడం లేదని, వారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతున్నారని తెలిపారు. ఉద్యోగం అడగడం, ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం నేరం కాదని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వారిని అవమానించినందుకు విద్యార్థి, నిరుద్యోగలోకానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.