1 March, 2026 | 8:39 PM

దాదాపుగా అయిపోయావే అలవాటుగా..

28-02-2026 12:00 AM

హీరో అడివి శేష్ ఇప్పుడు పూర్తిగా కొత్త అవతార్‌లో ‘డెకాయిట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్న అడివి శేష్.. మదనపల్లె యాసలో డైలాగులు చెప్పనున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సుప్రియా యా ర్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడి యోస్ సమర్పిస్తోంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘రుబారూ..’ అనే ప్రేమగీతం విడుదలైంది.

ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపర్చడమే కాకుండా చిన్మయితో కలిసి ఆలపించారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం అందించిన ఈ పాట ‘మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని అంటున్నది మనసే.. కాసేపు నువ్వూనేను కలిసే క్షణంలో లోకమంత తెలిసే.. నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా.. ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా..’ అంటూ సాగుతోంది. శేష్ మృణాల్ జంట మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ఎమోషనల్ పవర్. ఈ పాట సినిమా కథలో ఒక కీలక మలుపు కాబోతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ధనుష్ నిర్వహిస్తుండగా, జ్ఞాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు.