1 June, 2026 | 2:45 AM

అనుమతులే ఆలస్యం!

01-06-2026 02:04 AM

హైకోర్టు భవన పనుల జాప్యంలో మా తప్పిదం లేదు

సకాలంలో అన్నీ సమర్పించాం 

రోడ్లు, భవనాల శాఖ తుది నోటీసుకు స్పందించిన ‘టీమ్ వన్ ఇండియా’   

లేఖ ద్వారా సమగ్ర వివరణ

  80 శాతం డ్రాయింగులు సమర్పించాం, ఈ పనులన్నీ పూర్తి చేశాం

కొన్ని తమ కార్యాలయ పరిధికి సంబంధించినవే కావని స్పష్టం 

వివరణలను సానుకూలంగా పరిశీలించాలని వినతి

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు నూతన భవనాల నిర్మాణ జాప్యంలో తమ తప్పిదం లేదని టీమ్ వన్ ఇండియా సంస్థ స్పష్టం చేసింది. ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన పత్రాలన్నీ సకాలంలో సమర్పించామని పేర్కొంది. డ్రాయింగుల సమర్పణలో జాప్యం, సేఫ్ బేరింగ్ కెపాసిటీ (ఎస్‌బీసీ) నిర్ధారణలో వ్యత్యాసా లు, జాతీయ భవన నిర్మాణ నియమావళి ఉల్లంఘనలు వంటి ఆరోపణలపై ఆర్‌అండ్‌బీ శాఖ జారీ చేసిన తుది నోటీసుకు ప్రాజెక్ట్ కన్సల్టెంట్ సంస్థ టీమ్ వన్ ఇండియా ప్రై.లి స్పందించింది.

లేఖ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చింది. ఆర్ అండ్ బీ శాఖ లేవనెత్తిన అనేక అభ్యంతరాలకు గతంలోనే సమాధానాలు ఇచ్చామని, అవసరమైన, సవరించిన డ్రాయింగులు, వివరణలను ఇప్పటికే సమర్పించామని పేర్కొంది. పలువురు అధికారులు ప్రస్తావించిన అంశాలు ఇప్పటికే పరిష్కరించబ డ్డాయని, కొన్ని తమ కార్యాలయ పరిధికి సంబంధించినవే కావని లేఖలో సంస్థ స్పష్టం చేసింది. ఈ లేఖపై ఆర్ అండ్ బీ శాఖ స్పందన ఏ విధంగా ఉండనుందోనన్న చర్చ ఆయా వర్గాల్లో నడుస్తోంది. 

ఎస్బీసీ వివాదంపై..

సేఫ్ బేరింగ్ కెపాసిటీ (ఎస్‌బీసీ) నిర్ధార ణ విషయంలో తాము డీపీఆర్ దశలోనే సరైన పరీక్షలు నిర్వహించి విలువలను ఖరారు చేశామని సంస్థ తెలిపింది. అనంతరం స్థల పరిస్థితుల ఆధారంగా పునఃపరీ క్ష నిర్వహించినప్పటికీ, ఫౌండేషన్ వ్యయా న్ని తగ్గించేందుకు మాత్రమే ఆ ప్రక్రియ చేపట్టామని, తరువాత ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నామని పేర్కొంది. ఈ విషయంలో వచ్చిన ఆరోపణలు నిరాధారమని కన్సల్టెన్సీ స్పష్టం చేసింది.

నిబంధనల ఉల్లంఘన జరగలేదు..

జాతీయ భవన నిర్మాణ నియమావళి ఉల్లంఘన ఆరోపణలను కూడా టీమ్ వన్ ఇండియా ఖండించింది. టెండర్ దశ తర్వా త భవన స్థాయిలలో మార్పులు చోటుచేసుకోవడంతో బేస్‌మెంట్ స్థాయిలో ఏర్ప డ్డాయని, నివాస గదుల కోసం కాకుండా రికార్డు గదులు, సర్వీస్ రూములు, పార్కిం గ్ కోసం మాత్రమే బేస్‌మెంట్‌ను ప్రతిపాదించామని పేర్కొంది.

ప్రధాన కారణాలు..

డ్రాయింగులు, డిజైన్లను సమర్పించడ ంలో దాదాపు 10 నెలల జాప్యం చోటుచేసుకున్నప్పటికీ అందులో 8 నెలలు ప్రభు త్వ అనుమతులు, బాహ్య పరిస్థితుల కారణంగానే జరిగాయని  సంస్థ స్పష్టం చేసిం ది. భూసరిహద్దుల పునర్నిర్ణయం, భూ వినియోగ మార్పు, సాగునీటి శాఖ అనుమతులు, నాలాల మళ్లింపు, పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ క్లియరెన్స్, హెచ్‌ఎం డబ్ల్యూఎస్‌ఎస్‌బీ అనుమతి, 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ మార్పిడి, చెట్ల తొల గింపు అనంతరం మాస్టర్ ప్లాన్ సవరణ వంటి అంశాలు ప్రధాన కారణాలని కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది.

ఈ కారణాలతో వాస్తు నమూనాలు, నిర్మాణ డ్రాయింగు లు మరియు ఎంఈపీ (మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్) డిజైన్లలో ఆలస్యం జరి గిందని తెలిపింది. అధికారుల అభ్యంతరాలు, పరిశీలనలకు సంబంధించి తాము అనేకసార్లు సమాధానాలు సమర్పించామని, ఐఐటీ గౌహతి నిపుణుల ఆమోదం పొందిన నిర్మాణ డ్రాయింగులను కూడా శాఖ కు అందించామని కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. అవసరమైన సవరణలు, వివరణలు అన్నీ సమయానికి పంపించామని తెలిపింది.

ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు

తాము ఒప్పందంలోని ఏ నిబంధననూ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని ప్రాజెక్టు కన్సల్టెన్సీ సంస్థ టీమ్ వన్ ఇండియా ప్రై.లి. స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ ప్రారంభ దశలో పోస్ట్-టెన్షన్ సిస్టమ్ ప్రతిపాదించబడినప్పటికీ, ఐఐ టీ గౌహతి నిపుణుల సూచనల మేరకు సంప్రదాయ నిర్మాణ విధానాన్ని అనుసరించినట్లు వెల్లడించింది. భవన స్థిరత్వం, అగ్ని ప్రమాద నిరోధకత, నిర్వహణ సౌలభ్యం దృష్ట్యా ఈ మార్పు జరిగిందని వివరించింది.

4,800 డ్రాయింగులను సమర్పించాం

ఇప్పటివరకు సుమారు 4,800 డ్రాయింగులు సమర్పించామని, ఇది మొత్తం పనిలో దాదాపు 80 శాతానికి సమానమని సంస్థ పేర్కొంది. ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్, ఎంఈపీ డ్రాయింగుల్లో 80 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించింది.

నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం

తమ వివరణను సానుకూలంగా పరిగణించాలని, మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని టీమ్ వన్ ఇండియా యాజమాన్యం హామీ ఇచ్చింది. ప్రాజెక్టులో చోటు చేసుకున్న ఆలస్యం.. ప్రధానంగా చట్టపరమైన మరియు ప్రభుత్వ అనుమతులకు సంబంధించినవేనని, వాటిలో తమ పాత్ర లేదన్నారు.