18 July, 2026 | 12:24 AM

31లోగా రేషన్ కార్డు లబ్ధిదారులందరూ ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి

18-07-2026 12:19 AM

జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్

మెదక్, జులై 17 (విజయక్రాంతి): రేషన్కార్డు లబ్దిదరులందరూ జూలై 31, 2026 లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌర సరఫరాల కమిషనర్ (CCS) ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులైన రేషన్ కార్డుదారులందరూ ఈ-కేవైసీ (eKYC)ను ఈ నెలాఖరు (జూలై 31)లోగా తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని భారత ప్రభుత్వానికి (GoI) ఈ-కేవైసీ వివరాలను నవీకరించాల్సి ఉన్నందున జిల్లాలో ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టినట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని రేషన్ షాప్ డీలర్లు తమ పరిధిలోని లబ్ధిదారులతో పాటు పోర్టబిలిటీ (One Nation One Ration Card) ద్వారా రేషన్ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీని కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. మెదక్ జిల్లాలో అన్ని రేషన్ షాప్ డీలర్లు ప్రతిరోజూ నిరంతరాయంగా రేషన్ దుకాణాలను తెరిచి ఉంచి, అర్హులైన లబ్ధిదారులందరికీ, అలాగే పోర్టబిలిటీ ద్వారా రేషన్ పొందుతున్న లబ్ధిదారులకు కూడా ఈ-కేవైసీ నిర్వహించి, జూలై 31వ తేదీలోగా 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆయన సూచించారు. త్వరలో కమిషనర్ జిల్లాల వారీగా ఈ-కేవైసీ పురోగతిని సమీక్షించనున్నందున, అర్హులైన రేషన్ కార్డుదారులు తమ సమీప రేషన్ దుకాణాన్ని సందర్శించి జూలై 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.