గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే...
- పొన్నాలపల్లిలో గ్రామ పంచాయతీ నూతన భవనం
- ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్..
గంభీరావుపేట, జూలై 17 (విజయక్రాంతి):గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లిలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ( ఆర్ జి ఎస్ ఏ )కింద కేంద్రం 20 లక్షలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని సర్పంచ్ పొన్నాల మహేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి ఎక్కువగా కేంద్ర నిధులతోనే జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం ద్వారా తెలంగాణ గ్రామాల్లో సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసి చెరువుల పునరుద్ధరణ, సీసీ రోడ్లు, శ్మశానవాటికలు నిర్మించినట్లు తెలిపారు. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా గ్రామీణ రహదారులు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచినట్లు పేర్కొన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులకు మళ్లిస్తున్నదని విమర్శించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీధర్ బాబు తహసిల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీవో రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ,మండల ప్రధాన కార్యదర్శి తొట్ల మల్లేష్ యాదవ్, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






