04-02-2026 12:00:00 AM
దేశంలో ఏ రాజకీయపార్టీ అధికారంలో ఉన్నా సుపరిపాలన జరిగి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని భావిస్తారు. ఈ సందర్భంగా కనీస మౌలిక వసతులైన నీరు, విద్యుత్, రవాణా తదితర సౌకర్యాలు, ఉచిత విద్య, వైద్యం అందిస్తారని ఆశించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం దేశంలో సుపరిపాలనను పక్కనబెడుతున్న ప్రభుత్వాలు.. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, నిర్మాణాల వ్యవస్థలపై విచారణలు జరిపిస్తూ కాలం గడుపుతున్నాయి.
గత పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు కూడా బాధ్యులే. కానీ వీరు పార్టీ మారిన వెంటనే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తుంటారు. అధికారంలో ఉన్న నాయకులు ప్రజలు తమకే పట్టాభిషేకం కల్పించారని, ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ పార్టీలకు ప్రజల్లో విశ్వాసం లేదనే భావన వద్దు. అన్ని రాజకీయ పక్షాలపై ప్రజల్లో విశ్వాసం ఉంటుంది.
గెలుపోటములు ఎన్నికల వరకే పరిమితం. ప్రభుత్వం ఏదైనా నాయకత్వ విశ్వాసమనేది అధికారంలో ఉన్నప్పుడు వారు చేసే అభివృద్ధి పనులపై ఆధారపడి ఉంటుందన్న విషయం గమనించాలి. ఇదివరకు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అధికారంలో ఉన్నవారు మాత్రమే గాక అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అభివృద్ధి కోసం విస్తృత చర్చలు జరిపేవారు.
అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సమావేశాలు ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి గెలిచిన అధికార రాజకీయ పక్షం నియంత పోకడ విడిచిపెట్టి అన్ని రాజకీయ పక్షాలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రజా శ్రేయస్సు సంస్థలతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి.
దండంరాజు రామచంద్రరాజు, హైదరాబాద్