calender_icon.png 4 February, 2026 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరకాల ఒప్పందం!

04-02-2026 12:00:00 AM

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదరడం శుభపరిణామం. కొన్ని నెలలుగా ఎటూ తెగని వాణిజ్య ఒప్పందం చర్చలు కొలిక్కి రావడమే గాక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిసున్నట్లు పేర్కొనడం శుభసూచకం. ఇప్పటివరకు భారత్‌పై ఉన్న ప్రతీకార సుంకాల శాతాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొనడం ముదావహం. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ‘అమెరికా, భారత్‌ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని శతాబ్దపు అతిపెద్ద ఒప్పందం’గా అభివర్ణించారు.

ఇక సుంకాల తగ్గింపుతో టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో చైనా వస్తువులపై 34 శాతం, బంగ్లాదేశ్ వస్తువులపై 20 శాతం సుంకాలు ఉన్నాయి. భారత్‌పై 18 శాతం సుంకం ఉండటంతో ఆసియా దేశాలతో పోలిస్తే అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వేసినట్లే. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ద్వారా  రూపాయి బలపడేందుకు ఆస్కారముంది.

దేశంలోకి విదేశీ పెట్టుబడులకు అవకాశముండడంతో రూపాయి విలువ కూడా పెరిగేందుకు చాన్స్ ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం మంచిదే అయినప్పటికీ కొన్ని చిక్కులున్నాయి. రష్యా వద్ద చమురు కొనుగోలు చేయడం భారత్ ఆపేసిందని, ఇకపై తమ వద్దే చమురు కొనుగోలు చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయమై సానుకూలంగా స్పందించిన భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు.

మరోవైపు తమ నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయడంపై భారత్ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును పూర్తిగా ఆపనప్పటికీ తగ్గించుకునే అవకాశమైతే ఉంది. వాస్తవానికి రష్యాతో మనకు మంచి దోస్తీ ఉంది. అదీగాక భారత్ ఎవరితోనైనా శాంతి చర్చల ద్వారానే సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపేందుకు ఇష్టపడుతుంది.

కేవలం ట్రంప్ చెప్పాడన్న కారణంతో రష్యాతో ఉన్న మైత్రిని చెడగొట్టుకునే సాహసాన్ని భారత్ చేయకపోవచ్చు. మరోవైపు కొన్ని నెలలుగా అమెరికాతో నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం ఉన్నపళంగా ఎలా జరిగిందంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీ భయపడి ట్రంప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని ధ్వజమెత్తారు. అదానీని అమెరికా టార్గెట్ చేయడం, ఎప్‌స్టీన్ ఫైల్స్..  మోదీ రాజీపడేందుకు కారణాలుగా నిలిచాయన్నారు.

అయితే ఇటీవలే భారత్, ఈయూ మధ్య అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగడం ట్రంప్‌కు మింగుడుపడని అంశం. అంతేకాదు ట్రంప్ వికృత చర్యలతో ప్రపంచ దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద శక్తిగా ఉన్న భారత్‌తో వ్యాపారం చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. భారత్ ఆర్థికంగా ఎదుగుతున్న వేళ.. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో అమెరికాకు నష్టం కలిగిస్తుందన్న ఉద్దేశంతో ఉన్నపళంగా మాట మార్చిన ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తున్నది. అంతిమంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడం భారత్‌ను అంతర్జాతీయంగా ఒక మెట్టు పైకి ఎక్కించిందని చెప్పొచ్చు.