ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు టీచర్లను నియమించాలి
సిపిఎం మండల కార్యదర్శి
ఎన్. సబిత
ఘట్ కేసర్, జూలై 8 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు టీచర్లను నియమించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నార్కట్ పల్లి సబిత డిమాండ్ చేశారు. 187 మంది విద్యార్థులు ఉండగా నలుగురు టీచర్లు మాత్రమే ఉన్నారని, అదనపు టీచర్లను నియమించి విద్యార్థుల సంఖ్య పెంపుదలకు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సహకరించాలని ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాజీవ్ గృహకల్ప ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం మండల కమిటీ ప్రతినిధి బృందం సర్వే నిర్వహించింది.
విద్యార్థులు ఉపాధ్యాయులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు త్రాగునీరు అందడం లేదని, ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేయాలని కోరారు. 25 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున మొత్తం 7 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం నలుగురు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. నేటికీ విద్యార్థులకు యూనిఫామ్ ఇవ్వలేదన్నారు. క్రీడా స్థలం కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంటగది లేకపోవడంతో విద్యార్థులు చదివే స్థలంలోనే వంట చేయాల్సి రావటంతో విద్యార్థులు చదువులకు ఆటంకంగా ఉందన్నారు. వంటగదిని మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం ప్రతినిధి బృందంలో సీనియర్ నాయకురాలు చల్లగుండ అరుణ, శాఖ కార్యదర్శి సునీతదేవి, కప్పల బలరాం తదితరులు పాల్గొన్నారు.






