5 August, 2026 | 6:16 PM

మోటకొండూర్ లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పర్యటన

05-08-2026 04:57 PM

ఆలేరు,(విజయక్రాంతి): మోటకొండూర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం పరిధిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బుధవారం పర్యటించారు. మోటకొండూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ల పంపిణీపై ఆరా తీశారు. లబ్ధిదారులకు అందుతున్న రూ.2,016 పెన్షన్ లో అదనంగా రూ.16 చెల్లిస్తున్నారా లేదా అని లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రానున్న 2, 3 నెలల్లో పెన్షన్ల చెల్లింపులు బ్యాంకుల ద్వారా చేస్తామని తెలిపారు.

అనంతరం నూతన 'జలసిరి' కార్యక్రమం అమలుపై ఎంపీడీఓ ఇందిరాను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. తదనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ ను సందర్శించి వంటశాల, మధ్యాహ్న భోజనం, సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. విద్యార్థులతో మాట్లాడి వసతులపై ఆరా తీసి, నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.