5 August, 2026 | 2:19 AM

నటుడు ప్రదీప్‌సింగ్ రావత్ ఆకస్మిక మృతి

05-08-2026 12:00 AM

ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) కన్నుమూశారు. ముంబయిలోని నివాసంలో గుండెపోటుతో ఆయన మృతిచెందారు. కొంతకాలంగా రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందటం సినీప్రియులను దిగ్బ్రాంతికి గురిచేస్తోది. ప్రదీప్ సింగ్ రావత్ ఇక లేరన్న విషయాన్ని నటుడు యశ్‌పాల్ శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా, టాలీవుడ్ సహా భారతీయ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ప్రదీప్ సింగ్‌కు భార్య కల్యాణి రావత్, విక్రమాదిత్య అనే కుమారుడు ఉన్నారు. ప్రదీప్ సింగ్ రావత్ తెలుగు, హిందీ, తమిళ తదితర భాషల్లో ఆయన నటించారు. టాలీవుడ్‌లో ‘సై’, ‘లక్ష్యం’, ‘నాయక్’, ‘ఛత్రపతి’, ‘గజిని’ చిత్రాల్లో ప్రదీప్ సింగ్ రావత్ పోషించిన పాత్రలు ఆయనకు మంచిపేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా శక్తిమతమైన ప్రతినాయకుడు పాత్రలను పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ సింగ్. 1952, జనవరి 21న జబల్పూర్ (మధ్యప్రదేశ్)లో జన్మించిన ప్రదీప్ సింగ్ రావత్.. టీవీ సీరియల్ ద్వారా నటనారంగంలో అడుగుపెట్టారు.

బీఆర్ చోప్రా రూపొందించిన ప్రసిద్ధ టెలివిజన్ ధారావాహిక ‘మహాభారత్’ (1988)లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. తెలుగులో నితిన్ హీరోగా, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి రగ్బీ క్రీడా నేపథ్యంలో రూపొందించిన చిత్రం ‘సై’ (2004) ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ చిత్రంలో భిక్షూ యాదవ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచినందుకు గాను ఉత్తమ విలన్‌గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. తమిళ చిత్రం ‘గజినీ’ (2005)లో ఈయన పోషించిన ద్విపాత్రాభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత 2008లో ఆమిర్‌ఖాన్ కథానాయకుడిగా వచ్చిన హిందీ రీమేక్ ‘గజినీ’లోనూ అదే పాత్రను తిరిగి పోషించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సర్పరోష్ (1999), లగాన్ (2001), స్టాలిన్ (2006), వన్ : నేనొక్కడినే’ (2014), సరైనోడు (2016) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.