నకిలీ పట్టాల పేరుతో మోసం చేసిన బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలి
న్యాయం చేయాలని బాధితురాలు కరిష్మా జైస్వాల్ వేడుకోలు
ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి): నకిలీపట్టాల పేరుతో డబ్బులు వసూళ్లు చేసి మోసం చేసిన బీజేపీ నాయకుడిపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ హైదర్గూడలోని ఎన్‌ఎస్‌ఎస్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు కరీష్మ జైస్వాల్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పేరుతో నిరుపేదలను మోసం చేసిన బీజేపీ నేత నర్సింగ్ ముదిరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హిమాయత్నగర్ డివిజన్ విఠల్వాడికి చెందిన బీజేపీ సెంట్రల్ జిల్లా సెక్రటరీ కే. నర్సింగ్ ముదిరాజ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చంగిచర్ల గ్రామంలోని సర్వే నంబర్ 58లో ఇళ్ల స్థల పట్టాలు ఇప్పిస్తానని చెప్పి వెయ్యికి పైగా పేద కుటుంబాల నుంచి కోట్లల్లో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.
నిరుపేద ప్రజలకు మాయ మాటలు చెప్పి 60 నుంచి 100 గజాల ఇండ్ల స్థలం కోసం ఒక్కొక్కరిని దగ్గరి నుండి 50 వేల నుండి 3 లక్షలకు వరకు వసూలు చేసి నిరుపేదలను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలు అందుకున్న పేదలు చెంగిచర్ల సర్వే నెంబర్ 58 వద్దకు వెళ్లి చూడగా అది ప్రభుత్వ భూమి అని తేలిందన్నారు. ఇచ్చిన పట్టాలను తీసుకొని బాధితులు భూ పరిపాలన కమిషనర్ కార్యాలయానికి వెళ్లి మొరపెట్టుకున్నారు. అక్కడ విచారణ చేసి అధికారులు ఇవీ నకిలీ పట్టాలు అని తేల్చారన్నారు.
ఇళ్ల స్థలం వస్తుందనే ఆశతో చిరువ్యాపారాలు చేసుకొని బాధితులు అప్పులు చేసి డబ్బులు చెల్లించామని, తరువాత ఇచ్చిన పట్టాలు నకిలీవని అధికారుల విచారణలో తేలిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే తన వెనుక బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారని బెదిరింపులకు దిగుతున్నారని వారు తెలిపారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు తమవని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించి సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ లను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.






