చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం
అశ్వాపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీన ఎస్సీ కాలనీకి చెందిన నల్లగట్ల ప్రశాంత్ తన బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో అతని ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎస్సీ కాలనీకి చెందిన రాగం అశోక్, ఇసంపల్లి జంపయ్యలు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో నిందితుడు రాగం అశోక్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 35 గ్రాముల బంగారు వస్తువులు, 206 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు ఇసంపల్లి జంపయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఊరికి వెళ్లే ముందు విలువైన వస్తువులను ఇళ్లలో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని, అలాగే ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.






