హజ్-2027 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భారత హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్-2027 (1448 హిజ్రీ) యాత్రకు అర్హులైన ముస్లిం యాత్రికుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్ https:/www.hajcommittee.gov.in ద్వారా లేదా 'హజ్ సువిధా' మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
దరఖాస్తుల స్వీకరణ జూన్ 22, 2026 నుండి ప్రారంభమైందని, జూలై 20, 2026 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఉంటుందని, ఈ గడువు పొడిగింపునకు ఎలాంటి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. జూలై చివరి వారంలో 'ఖుర్రా' (డిజిటల్ యాదృచ్ఛిక ఎంపిక) పద్ధతి ద్వారా యాత్రికులను ఎంపిక చేయడం జరుగుతుందని, తాత్కాలికంగా ఎంపికైన ప్రతి యాత్రికుడు ఆగస్టు 10, 2026 లోపు రూ.1,52,300/-ల అడ్వాన్స్ మొత్తాన్ని తప్పనిసరిగా డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
దరఖాస్తుదారులు మార్గదర్శకాలను పూర్తిగా చదివి, కనీసం 31.12.2027 వరకు కాలపరిమితి కలిగి ఉన్న మెషిన్-రీడబుల్ భారతీయ పాస్‌పోర్ట్ ముందు, వెనుక పేజీలు, తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న పాస్‌పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చేసిన చెక్ లీఫ్, చిరునామా ధృవీకరణ పత్రాల స్కాన్ చేసిన కాపీలను మాత్రమే అప్‌లోడ్ చేయాలని సూచించారు. హజ్ సీటును కేటాయించిన తర్వాత రద్దు చేసుకుంటే నిర్వహణాపరమైన ఇబ్బందులు వస్తాయని, అంతేకాకుండా కొత్త మార్గదర్శకాల ప్రకారం భారీగా జరిమానాలు విధిస్తారని యాకూబ్ పాషా హెచ్చరించారు. కాబట్టి యాత్ర చేయాలనుకునే యాత్రికులు తమ సన్నద్ధతను, ప్రయాణంపై తమకున్న దృఢ నిబద్ధతను జాగ్రత్తగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకై 8520860785 నంబర్ కు సుప్రదించాలని కోరారు.






