1 July, 2026 | 1:34 AM

రీయింబర్స్‌మెంట్ ఎత్తివేసే కుట్ర

01-07-2026 12:00 AM

పేద విద్యార్థులతో ఆడుకుంటున్న సీఎం రేవంత్ 

శాంతియుతంగా నిరసన చేస్తే అరెస్టులా? 

పోలీసుల లాఠీచార్జ్‌ని ఖండిస్తున్నాం

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు

ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా

హైదరాబాద్/ముషీరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య ను అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఏబీ వీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పేర్కొన్నారు. బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థులు అడ్మిషన్లు పొందే సమయంలో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా అడ్మిషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

భారీ సంఖ్యలో విద్యా ర్థులు, ఏబీవీపీ నాయకులు ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. కార్యాలయ గేటు ఎక్కి వెళ్లేందుకు నాయకులు ప్రయత్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని, నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యార్థి నాయకులు పోలీసుల బారికేడ్లను దాటుకుంటూ విద్యామండలి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారికి, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్త చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలువురు ఏబీవీపీ ముఖ్య నాయకులను, విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. అదుపులోకి తీసుకున్న నాయకులను స్థానిక పోలీస్ స్టేషన్‌లకు తరలించినట్లు తెలిసింది. 

ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యదర్శి మాచెర్ల రాంబా బు మాట్లాడుతూ.. నిరసన తెలియజేస్తున్న సమయంలో పోలీసులు విచక్షణ మరిచి విద్యా ర్థులు, విద్యార్థి పరిషత్ నాయకుల మీద లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వము కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలవుతున్నారని వాపోయారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు.

మరొకవైపు గవర్నమెంట్ కాలేజీల్లో సైతం ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నారంటే దేనికి సంకేతమని ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. విద్యార్థి నాయకులపై, విద్యార్థులపై జరిగినలాఠీఛార్జ్‌ను  తెలంగాణ విద్యార్థి సమాజంపై జరిగిన దాడిగా ఏబీవీపీ అభివర్ణిస్తున్నదన్నారు. తప్పకుండా దీనికి తగిన మూల్యం రేవంత్ రెడ్డి చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన 60 మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులను భేషరత్ రిలీజ్ చేయాలని, లాఠీచార్జీలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాల ని డిమాండ్ చేశారు. ధర్నాలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సందీప్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాజు, శ్యామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.