1 July, 2026 | 2:23 AM

విద్యార్థినుల భద్రతకు అండగా షీ టీమ్

01-07-2026 01:32 AM

డీసీపీ భాస్కర్

మంచిర్యాల క్రైమ్, జూన్ 30 : విద్యార్థినీల, మహిళల భద్రతకు అండగా షీ టీమ్ సిబ్బంది అండగా ఉంటుందని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. మంచిర్యాల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

మహిళలు, విద్యార్థినుల భద్రత, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని పరిరక్షించడమే షీ టీమ్ ప్రధాన లక్ష్యమని, పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటే భయపడాల్సిన అవసరం లేదని, కేసు నమోదు చేస్తే భవిష్యత్తు దెబ్బతింటుందనే అపోహలను విడిచిపెట్టాలని సూచించారు. మహిళలు, విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా షీ టీమ్ దృష్టికి తీసుకురావాలని కోరారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ కాల్స్, సందేశాలు లేదా ప్రత్యక్షంగా ఎలాంటి వేధింపులు ఎదురైనా వాటిని సహించకుండా వెంటనే షీ టీమ్ను సంప్రదించాలని సూచించారు.

విద్యాసంస్థలు, వసతి గృహాలు, నివాస ప్రాంతాలు, ఉద్యోగ ప్రదేశాలు లేదా ప్రయాణ సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనా షీ టీమ్ సహాయం తీసుకోవాలని సూచించారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే ‘నో‘ చెప్పే ధైర్యాన్ని పెంపొందించాలని, జీవితంలో అనేక సమస్యలకు మూల కారణం ఇష్టం లేకపోయినా తిరస్కరించలేకపోవడమేనని వివరించారు.

భవిష్యత్తులో చదువు, ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు, ప్రలోభాల మధ్య సరైన నిర్ణయాలు తీసుకునేందుకు విశ్లేషణాత్మక ఆలోచనతో పాటు అవసరమైనప్పుడు ‘నో‘ చెప్పగల ధైర్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇన్చార్జి ఎస్‌ఐ ఉషారాణి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అనూష, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.