17 April, 2026 | 3:43 AM

బీసీ మహిళా సబ్‌కోటా కల్పించాలి

17-04-2026 02:00 AM
  1. బీసీలను చిన్నచూపు చూస్తే కేంద్రానికి బీసీల తడాఖా చూపిస్తాం 

కేంద్రం బీసీలపై వివక్షత వీడాలి  

బీసీ మహిళల ప్రాతినిథ్యం లేని బిల్లును మేం ఒప్పుకోం 

సంపూర్ణ కులగణన తర్వాతనే డీలిమిటేషన్, మహిళా బిల్లు తేవాలి 

బీసీ సబ్ కోటాపై ప్రధాని తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి 

ఫూలేను గౌరవించావు సంతోషం.. కానీ బీసీలకు అన్యాయం చేయొద్దు 

ఢిల్లీలో జరిగిన ఓబీసీ మహిళాపోరు దీక్షల్లో అఖిలపక్ష నేతల హెచ్చరిక

న్యూఢిల్లీ, ఏప్రిల్16 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో లాగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, సబ్ కోటా కల్పించిన తర్వాతనే మహిళా బిల్లుకు ఆమో దం తెలపాలని అఖిలపక్ష పార్టీల నాయకులు, ఓబీసీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని సం యుక్తంగా డిమాండ్ చేశారు. బీసీలను చిన్నచూపు చూసినా, బీసీ మహిళా సబ్‌కోటా ఇవ్వకపోయినా మా తడాఖా చూపిస్తామని, బీసీ మహిళల ప్రాతినిథ్యం లేని మహిళా బిల్లును మేం ఒప్పుకోమని హెచ్చరించారు.

బీసీల వాటా బీసీలకే దక్కాలే లేదంటే ఢిల్లీనీ వదలబోమని, సంపూర్ణ కులగణన తర్వాతనే డీలిమిటేషన్, మహిళా బిల్లు తేవాలని, బీసీ సబ్ కోటాపై ప్రధాని తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు బీ మని మంజరి అధ్యక్షతన బీసీ మహిళల పోరుదీక్షను భారీస్థాయిలో నిర్వహించారు.

ఈ దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేతలు వీ హనుమంతరావు, అనిల్‌జైహింద్ యా దవ్, బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, టీడీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, అంబిక లక్ష్మీనారాయణ, ఏపీ అధ్యక్షులు కేసన శంకర్‌రావు హాజరయ్యారు. మొదటగా దీక్షలో కూర్చున్న వందలాది మంది మహిళల నేతలకు మాజీ పార్లమెంట్ సభ్యులు పూలమాలవేసి పోరుదీక్షను ప్రారంభించారు.

ముందుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజు ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహిళా బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం బీసీలను మరో 80 సంవత్సరాలు రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలో జనాభా లెక్కలు, బీసీ కులాల లెక్కలు సేకరించిన తర్వాతనే నియోజకవర్గాల పెంపు, మహిళా బిల్లులో జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు ఒక కోటా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ద్వారా పెంచిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు మొత్తం మహిళా బిల్లు పేరుతో అగ్రకుల మహిళలకు కట్టబెట్టాలని కేంద్రం ఆలోచించడం చాలా దుర్మార్గమన్నారు. మహిళా బిల్లుల్లో బీసీ మహిళలకు జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని, ఈ డిమాండ్లను, దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ గౌరవించాలని, బీసీ మహిళాలకు అండగా నిలబడాలని ఆయన కోరారు.

కులగణన చేస్తామని మాట ఇచ్చి నేడు జరుగు తున్న దేశవ్యాప్త జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకపోవడం, 2027 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోకుండా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేంద్రం ముందుకు సాగడం బీసీలను నమ్మించి, తడిగుడ్డతో గొంతు కోయడమేనని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీసీ కులగణనను చేపట్టి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించకపోతే దేశంలో అగ్గి మండిస్తామని, భారత్ బంద్ నిర్వహించి తీరుతామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీ సమాజం బుద్ధి చెబుతుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. 

జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి:వీహెచ్ 

అనతరం కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్‌జైహింద్‌యాదవ్ మాట్లాడుతూ మహిళా బిల్లు సబ్ కోటా ఉండాల ని, ఇప్పటికే ఇండియా కూటమి తరఫున ప్రధానికి లేఖ రాశామన్నారు. దేశంలోని అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయంతో మహిళా బిల్లు ఆమోదించడా నికి బీసీ మహిళలకు సబ్ కోటా సాధన కోసం జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

బీసీలకు న్యాయం చేయాలని బీసీల తరఫున పార్లమెంట్‌లో కాంగ్రెస్ గట్టిగా కొట్లాడుతోందని అవసరమైతే బీసీ ఉద్యమ సంఘాలతో కలిసి భారత్ బంద్‌కు మద్దతు ఇస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, శాసనసభాపక్ష నేత, మాజీస్పీకర్ సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహిళాబిల్లుకు బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందన్నారు.

ఇదే సమయంలో బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం లేని మహిళా బిల్లు సంపూర్ణం కాలేదని వారు అన్నారు. బీసీ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నప్పటికీ బీసీలకే రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోవడం దారుణమైన అన్యాయమని వారు మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ టీడీపీ విధానపరంగా బీసీలకు అనుకూలమని, కేంద్రంలో భాగస్వా మ్యం అయినప్పటికీ బీసీలకు అన్యా యం జరిగితే తప్పకుండా బీసీల తరఫున పోరాడుతామని అన్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు చర్చించి బీసీల పక్షాన నిలబడతామని వారు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షు డు కేసిన శంకర్‌రావు మాట్లాడుతూ బీసీ మహిళలకు రాజకీయ ప్రాతిథ్యాన్ని కల్పించి కేంద్రం బీసీల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. బీసీలపై వివక్షత చూపిం చడం మోదీకి తగదన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్య త్‌లో బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా భారీ మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు బీ మనిమంజరిసాగర్ మాట్లా డుతూ మహిళా బిల్లుపై ఉన్న చిత్తశుద్ధి బీసీ మహిళల సబ్‌కోటాపై ఎందుకు లేదని కేంద్రాన్ని నిలదీశారు. మహిళా బిల్లు పేరు తో మరొకమారు అగ్రకుల ఎమ్మెల్యే ఎంపీలతోపాటు వారి భార్యలు, కుమార్తెలు, కోడ ళ్లు సపరివార సమేతంగా చట్టసభలోకి అడు గు పెడతారని మహిళా బిల్లు వారసత్వ రాజకీయాలకు, అగ్రకుల రాజకీయ పునరావసా నికి వేదిక అవుతుందని ఆమె తెలి పారు. బీసీ మహిళలకు సబ్ కోటా సాధించేవరకు ఢిల్లీని వదిలిపెట్టేది లేదని, అవసరమైతే పార్లమెంటును ముట్టడించి తీరుతామని ఆమె హెచ్చరించారు.

ఈ దీక్షలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకురాలు ఇందిరాశోభన్, సునీతారావు, బీసీ మహిళా సంఘాల నేత లు దాసరి ఉష, డాక్టర్ రమా, కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్, గణేష్‌చారి, కనకల శ్యామ్, కుమ్మ రి క్రాంతికుమార్, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, తారకేశ్వరి, సంధ్యారాణి, స్వర్ణగౌడ్, సుజాత, మీనాదేవి, గౌతమి, రాజేశ్వరి, గూడూరు భాస్కర్, కవులే జగన్నాథం, శివప్రసాద్, ఉదయ్‌నేతతోపాటు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్ నుంచి మహిళానేతలు పాల్గొన్నారు.