8 June, 2026 | 3:47 AM

దౌత్యంతోనే సరిహద్దు సమస్యకు పరిష్కారం

08-06-2026 01:43 AM

నేపాల్ మంత్రి శిశిర్ ఖనాల్

న్యూఢిల్లీ, జూన్ 7: దౌత్య చర్చల ద్వారానే సరిహద్దు సమస్యలను భారత్‌తో కలిసి పరిష్కరించుకునేందుకు నేపాల్ సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ అన్నారు. శనివారం భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో సమావేశమై అనేక అంశాలపై చర్చించారు. అనంతరం ఆదివారం ఖనాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించుకోలేని సమస్య ఏదీ ఉండదన్నారు. కైలాస మానస సరోవర్ యాత్ర అత్యంత భిన్నమైన సరిహద్దు ప్రాంతం నుంచి కొనసాగుతుందని చెప్పారు.

చాలామంది నేపాల్ గుండా ప్రయాణిస్తారని అన్నారు. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతం ద్వారా భారత్, చైనాల మధ్య ఒప్పందాన్ని పునరుద్ధరించడంపైనే తాము ఆందోళన చెందుతున్నామని అన్నారు. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతంలోని భూమి తమదే అని నేపాల్ సమ్మతి లేకుండా ఇరుదేశాలు ఒప్పందాలను చేసుకోలేవన్నారు. వాగ్ధానాలకు, వాస్తవికతకు ఉన్న అంతరాన్ని తగ్గించడమే తమ బాధ్యతని పేర్కొన్నారు. ప్రపంచవేదికపై వేగంగా ఎదుగుతోన్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు. వాణిజ్యం, సరిహద్దు, అనుసంధానం, ఇంధన భాగ స్వామ్యం, నీటి వనరుల నిర్వహణ ఇలా అనేక విషయాలపై భారత్‌తో చర్చలు జరిపామని శిశిర్ ఖనాల్ తెలిపారు.