రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలి
మహబూబాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పాత బజార్ ప్రాంతంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, పాఠకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి ని కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లా కన్వీనర్ మామిడాల సత్యనారాయణ, స్టేట్ కో కన్వీనర్ మైస శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గ్రంథాలయం కొత్త బజార్లో మాత్రమే ఉండటం వల్ల పాత బజార్ పరిధిలోని 19 వార్డుల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల సమయం ఖర్చు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పాత బజార్ ప్రాంతంలో ఆధునిక వసతులతో కూడిన రీడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రశాంత వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుందని, మహిళలు, వయోజన పాఠకులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న జిల్లా గ్రంథాలయంపై పడుతున్న రద్దీ కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ, అడ్వకేట్ వాసం ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.






