15 August, 2026 | 5:59 PM

జీఎం కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 04:21 PM

నస్పూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో శని వారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మనకు ఈ స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. సింగరేణి దేశంలోనే మరే ప్రభుత్వరంగ సంస్థ కల్పించనన్ని సంక్షేమ పథకాలు కల్పిస్తూ ఒక ఉపాధికల్పన కేంద్రంగా కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది కంపెనీ స్థాయిలో, ఏరియా స్థాయిలో నిర్దేశిత లక్ష్యాలను రక్షణతో సాధించేలా సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి సారధ్యంలో, డైరెక్టర్ల నిరంతర పర్యవేక్షణలో ముందుకు సాగుతున్నామన్నారు.

కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా థర్మల్ పవర్, సోలార్, గ్యాసిఫికేషన్, గ్రీన్ ఎనర్జీతోపాటు ఇతర మైనింగ్ రంగాలవైపు కూడా అడుగులు వేస్తున్నామన్నారు. ముఖ్యంగా రక్షణ విషయంలో సింగరేణిలోనే శ్రీరాంపూర్ ఏరియాకు అగ్రగామిగా నిలుస్తోందని, 56 వార్షిక భద్రోత్సవాలలో 19 బహుమతులతో సింగరేణిలోనే నెంబర్ వన్ గా శ్రీరాంపూర్ నిలిచిందన్నారు. అటు ఫైవ్ స్టార్ రేటింగ్ లోనూ ఆర్కే న్యూటెక్, ఆర్కె 6 గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించటమే కాకుండా 99 శాతం మార్కులతో  దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఆర్కే న్యూటెక్ గని నిలిచి జాతీయ స్థాయిలో శ్రీరాంపూర్ సత్తాను చాటిందన్నారు.

ఈ సందర్భంగా కంపెనీ స్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా ఎంపికై ఇవాళ కొత్తగూడెంలో ఛైర్మన్ చేతుల మీదుగా సత్కారం పొందిన సామాని సదానందంతో ఏరియా పరిధిలో ఉత్తమ ఉద్యోగిగా సత్కారం పొందిన ఉద్యోగులను, ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులను, ప్రతిభావంతులైన విద్యార్థులను జీఎం మునిగంటి శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా సింగరేణి పాఠశాల విద్యార్థులు, సింగరేణి కళాకారుల బృందం సభ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం కృష్ణ ప్రసాద్, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీసైదా, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ లక్కాకుల మహేష్, డీజీఎం(పర్సనల్) అనిల్ కుమార్, అన్ని విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు , సేవా సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.