సూర్యాపేట ప్రజల చిరకాలవాంఛ అయిన రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయాలి
11 వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్న జర్నలిస్టులు
సూర్యాపేట, ఆగస్టు 24 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ ను ప్రభుత్వం తప్పక ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, సంకినేని వెంకటేశ్వర్ రావులు అన్నారు. జాతీయ రహదారి 65కు సమాంతర బుల్లెట్ ట్రైన్ సాధన కోసం బుల్లెట్ సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ రోజైన సోమవారం రిలే నిరాహార దీక్షలో జర్నలిస్ట్ లు కూర్చోగా వారికి మద్దతు పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతమంతా సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. మొదటగా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ జరిగినప్పటికీ దాన్ని పక్కదారి పట్టించడం సరికాదన్నారు.. రైల్వే లైన్ ఉన్న వైపే మరో రైల్వే లైను వేయడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మొదట కేటాయించినట్లుగా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అలాట్మెంట్ జరగాలన్నారు.
బుల్లెట్ ట్రైన్ సాధన కోసం రైల్వే సాధన సమితి అఖిలపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి పోరాటానికి తమ వంతు మద్దతు ఉంటుందన్నారు. దీక్షలో కూర్చున్న వారిలో జర్నలిస్ట్ లు వజ్జే వీరయ్య, గుండా శ్రీనివాస్ గుప్తా, చల్లా చంద్రశేఖర్, రాంబాబు, మల్లికార్జున్, యాదగిరీ, రవి, శ్రీనివాస్ , తదితరులు ఉన్నారు. కాగా సోమవారం దీక్షకు మాజీ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, మండాది డేవిడ్ కుమార్, పోలబోయిన కిరణ్, రాపర్తి శ్రీనివాస్, నేరెళ్ల మధు, సట్టు నాగయ్య తదితరులు సంఘీభావం తెలిపారు.






