దేశ చరిత్రలో కీలక ఘట్టం
మహిళలకు చట్టసభల్లో ౩౩% రిజర్వేషన్ల కోసమే బిల్లు
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: ప్రధాని మోదీ
- ఏపీలో 38, తెలంగాణలో 26 లోక్‌సభ స్థానాలు
- దక్షిణాదిలో స్థానాలు 129 నుంచి 195కి పెంపు
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ
- లోక్‌సభలో మహిళల సీట్లు 272: కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘావాల్
- బీజేపీ చాకచక్యాన్ని చూసి చాణక్యుడు నివ్వెరపోయేవాడు: ప్రియాంకా గాంధీ
- ఓబీసీ మహిళలకు లాభమేంటి: అఖిలేష్ యాదవ్
- దొడ్డిదారిన డీలిమిటేషన్: గౌరవ్ గొగోయ్
* ఎన్నో అభ్యంతరాలు.. మరెన్నో వ్యతిరేకతల మధ్య కేంద్ర ప్రభుత్వం గురువారం మహిళలకు చట్టసభల్లో ౩౩% కోటా, డీలిమిటేషన్ కోసం లోక్‌సభలో ౩ బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బీజేపీ ప్రభుత్వం మహిళల కోటా పేరుతో డీలిమిటేషన్ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంక ఆరోపించారు.
ఆ పార్టీ మరో సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. దొడ్డిదారిన డీలిమిటేషన్ అమలు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. వీరి వ్యాఖ్యలను ప్రధాని మోదీ కొట్టిపడేశారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం పెంచాలన్నదే తమ అభిమతమని వెల్లడిం చారు. డీలిమిటేషన్‌తో అన్ని రాష్ట్రాలకూ సమ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో లోక్‌సభ స్థానాలు 129 నుంచి 195కి పెరుగుతాయని వెల్లడించారు.
- ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు!
- డీలిమిటేషన్‌తో అన్ని రాష్ట్రాలకూ సమన్యాయం
- దక్షిణాదికి అన్యాయమనే విపక్షాల ఆరోపణలు అవాస్తవం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేష న్)తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే విపక్షాల వాదన అవాస్తవమ ని ప్రధాని మోదీ కొట్టిపడేశారు. కేంద్ర ప్రభుత్వానికి దక్షిణాది, ఉత్తరాది అనే భేదం లేదని, అన్ని రాష్ట్రాలకూ సమ న్యాయం జరగాలన్నదే తమ అకాంక్ష అని పేర్కొన్నారు.
డీలిమిటేషన్ ద్వారా తూర్పు నుంచి పడమర వరకు.. ఉత్తరం నుంచి దక్షిణం వరకు.. అన్ని రాష్ట్రాలకూ సమ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. లోక్‌సభలో కేంద్ర మంత్రులు అర్జు న్ రామ్, అమిత్‌షా మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని మోదీ ఆ బిల్లులనుద్దేశించి మాట్లాడారు. మహిళా రిజర్వేష న్లను రాజకీయ కోణంలో చూడొద్దని రాజకీ య పార్టీలకు పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్లను తీసుకురావడంలో తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని వెల్లడించారు.
మహిళా కోటా బిల్లును వ్యతిరేకించే రాజకీయ పార్టీలన్నీ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. ఒక చారిత్రక బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సభలో తాను ఉండటం తన అదృష్టమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలే కాదని, మహిళల సాధికారత, వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంపు కూడా అని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకమని, వారికి అవకాశమిస్తే దేశాన్ని సరికొత్త మార్గంలో నడిపిస్తారని కొనియాడారు. రాజకీయాల్లో తమ శక్తిని చాటేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని, ఎవరికైనా అవకాశమిస్తేనే వారి సామర్థ్యం తెలుస్తుందంటూ చమత్కరించారు.
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కల్పన అనేది మహిళలకు ఇచ్చే కానుక కాదని, అది వారి హక్కు అంటూ అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ల సాధన కోసం 30 ఏళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్రయత్నించామని, అయి న సాధ్యం కాలేదని గుర్తుచేసుకున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళా కోటా సాధ్యం కాకపోతే, ఇక మహిళలకు అన్యాయం జరిగినట్లేనని పేర్కొన్నారు.
మద్దతిచ్చే పార్టీలకే మనుగడ..
మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిని, మహిళలు క్షమించరని హెచ్చరించారు. రాజకీయ నేతలకు కచ్చితంగా బుద్ధి చెబుతారని చెప్పుకొచ్చారు. మహిళా బిల్లులకు మద్దతిచ్చే పార్టీలకే మనుగడ ఉంటుందని జోస్యం చెప్పా రు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఎలాంటి నష్టం లేదని ఉద్ఘాటించారు. ఈ బిల్లు తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా తమిళనాడు, తెలంగాణ ముఖ్యమంత్రులు స్టాలిన్, రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, ఉత్తరాది, దక్షిణాది అనే.. భేదభావమే తమకు లేదని తేల్చిచెప్పారు. బిల్లుల ద్వారా వచ్చే క్రెడిట్ తమకు వద్దని, విపక్షాలే తీసుకోవాలని, కానీ, మహిళా కోటా బిల్లును మాత్రం అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
లోక్‌సభలో మహిళల సీట్లు 272
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. మహిళా శక్తికి ప్రాధాన్యం ఇవ్వడమే మా లక్ష్యం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు కన్న మహిళా హక్కుల సాకారం కాబోతున్నది. డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత లోక్‌సభలో 815 సీట్లు పెరుగుతాయి. వాటిలో 272 సీట్లు మహిళలకు దక్కుతాయి. తద్వారా మహిళలకు సామా జిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం లభిస్తుంది. దయచేసి మహిళా కోటా బిల్లుపై రాజకీయం చేయొద్దు. అన్ని పార్టీలూ బిల్లులకు మద్దతు పలకాలి.
అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి
ఓబీసీ మహిళలకు లాభమేంటి?
మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలనీ మేమూ కోరుకుంటున్నాం. కానీ, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుల వెనుక భారీ కుట్ర దాగి ఉంది. జన గణన చేయకుండానే సీట్ల సంఖ్యను పెంచాలని ఎవరు నిర్ణయించారు? కుల గణ న జరగకుండా వెనుకబడిన తరగతుల (ఓబీసీ) మహిళలకు న్యాయం ఎలా జరుగుతుంది? మహిళా కోటా బిల్లుతో ఓబీసీ మహిళల భాగస్వా మ్యమెంత? కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బిల్లులు. బీజేపీ దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో ధికారం లో ఉంది. ఆ పార్టీ నుంచి ఎంతమంది మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు? ఎంత మంది మహిళా మంత్రులు ఉన్నారు? ముందు ఆ విషయం తేల్చండి. తర్వాత మహిళా కోటా బిల్లు సంగతి.
అఖిలేష్‌యాదవ్, సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు
దొడ్డిదారిన డీలిమిటేషన్
బిల్లు మహిళా రిజర్వేషన్ కోసం తెచ్చిందే కాదు, దీని వెనుక కుట్ర ఉంది. దొడ్డిదారిన డీలిమిటేషన్ తీసుకురావడానికి కేంద్రం పన్నిన వ్యూహమిది. జనగణన లేకుండా కేంద్రం లోక్ సభ సీట్లను ఎలా 815కు పెంచుతుంది. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వొచ్చు కదా. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న అభ్యంతరమేంటి? మీరు మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టి అడ్డంకులు సృష్టిస్తు న్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తిపై చేస్తున్న దాడి. అస్సోం, జమ్మూ కాశ్మీర్ లో చేసినట్లుగానే దేశవ్యాప్తం గా నియోజకవర్గాల సరిహద్దులను ఇష్టానుసారం మార్చేయాలనేది కేంద్రం ఉద్దేశం.
గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ సభ్యుడు






