మురుగునీటి కాలువ దుర్వాసనకు శాశ్వత పరిష్కారం
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
అమీన్పూర్, మే 17 : బీరంగూడ డివిజన్ పరిధిలోని జయలక్ష్మి నగర్, లక్ష్మి సాయి మెడోస్ కాలనీల మీదుగా వెళ్తున్న ప్రధాన మురుగు నీటి కాలువలో గల బండతో మురుగునీరు ఒకే చోట నిల్వ ఉండడం మూలంగా వెలువడుతున్న దుర్వాసన సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
ఆదివారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ తో కలిసి కాలువను పరిశీలించారు. అనంతరం కాలనీవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో బండను పూర్తిగా తొలగించి కాలువను శుభ్రపరచాలని జిహెచ్‌ఎంసి ఇరిగేషన్ ఎఇ గులాంను ఆదేశించారు.
కాలువ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడుతున్నామని తెలిపారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. కాలనీలలో సీసీ రోడ్లు, యుజిడిల నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని.. ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యను విన్నవించిన వెంటనే స్పందించి.. పరిష్కారం దిశగా కృషి చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి ఈఈ సురేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.






