ఉత్తర తెలంగాణకు గేమ్‌చేంజర్
- ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- 2,278.14 కోట్లతో 2,009.23 ఎకరాల్లో నిర్మాణం
- వేలాది మంది యువతకు ఉపాధి
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- డిసెంబర్ 31 నాటికి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ అభివద్ధికి మరో కీలక అడుగు పడిందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌లో ప్రతిష్ఠాత్మక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇందులో 1,609.23 ఎకరాలు భారత వైమానిక దళం అవసరాల కోసం, 400 ఎకరాలు సివిల్ ఏవియేషన్ ఎన్‌క్లేవ్, ఎంఆర్‌ఓ, కార్గో టెర్మినల్, హ్యాంగర్లు, భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. భూసేకరణతో పాటు ఇప్పటికే ఉన్న రహదారుల మళ్లింపు, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల తరలింపు, వాగుల మళ్లింపు, మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అన్ని అనుబంధ పనులకు అవసరమైన నిధులను కూడా ఈ పరిపాలనా అనుమతిలో భాగంగా కేటాయించినట్లు మంత్రి వివరించారు. ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ రాష్ట్రానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
భారత వైమానిక దళం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివద్ధి చేయనున్న ఈ ఎయిర్‌ఫీల్డ్ వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివద్ధి, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు విశేష ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో నిరంతర సమన్వయం ఫలితంగానే ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ వ్యయంతో పాటు అన్ని అడ్డంకుల తొలగింపు ఖర్చును కూడా భరిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణతో పాటు రహదారులు, విద్యుత్ లైన్లు, ఇతర మౌలిక వసతుల మార్పిడి పనులను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రాంతీయ సమతుల అభివద్ధే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని, ఆదిలాబాద్ జాయింట్ జర్ ఎయిర్‌ఫీల్డ్ ఉత్తర తెలంగాణ అభివద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.






