కాంతార, కార్తికేయ లాంటి డివోషనల్ థ్రిల్లర్
సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం లో ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలమ్స్ పతాకాలపై కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ‘వాట్ ఏ లాజిక్ సర్ జీ’ పాటను లాంచ్ చేశారు.
ఈ ఈవెంట్‌లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. “మహేంద్రగిరి వారాహి’ సినిమాలో కథ, నా పెర్ఫార్మెన్స్ చాలా ప్రత్యేకంగా, వేరే కోణంలో ఉంటాయి. ఇది ఒక డివోషనల్ థ్రిల్లర్. ‘కాంతారా’, ‘కార్తికేయ’, ‘విరూపాక్ష’ లాంటి సినిమాలు ఎంతో పెద్ద విజయాలు సాధించాయి. అలాంటి సినిమాల జాబితాలోకి ‘మహేంద్రగిరి వారాహి’ కూడా చేరుతుందని నమ్ముతున్నా” అన్నారు. ‘సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంద’ని డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి చెప్పారు. ‘ఇది అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా’ అని నిర్మాత మధు తెలిపారు. ఇంకా ఈ వేడుకలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, వంశీ చాగంటి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.






