15 May, 2026 | 3:07 AM

కరీంనగర్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి

15-05-2026 12:47 AM

కలెక్టర్‌కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లేఖ

కరీంనగర్, మే 14 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలో ఎటువంటి అనుభవం లేకుండా విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు, డాక్టర్ మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ లేఖ రాశారు.

కరీంనగర్లో చాలా ప్రైవేట్ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు అత్యంత దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. ధనవంతులు పూర్తిగా వ్యాపార ధోరణితో కుమ్మక్కై ఆసుపత్రులు పెడుతున్నారని, అర్హత లేని డాక్టర్లు, సిబ్బందిని తక్కువ జీతాలకు పెట్టుకుని వారితో శస్త్రచికిత్సలు చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘లిఫ్టులు, వీల్చైర్లు, బెడ్లు వంటి అత్యవసర సౌకర్యాలు లేవు, వీటిపై పర్యవేక్షణ అవసరం, సరైన పారిశుద్ధ్యం లేక రోగులు నరకం చూస్తున్నారని పేర్కొన్నారు.

చిన్న జ్వరం వచ్చి చికిత్స కోసం డాక్టర్ ను సంప్రదిస్తే అనవసర పరీక్షలు రాసి లక్షల్లో బిల్లులు దోచుకుంటున్నారని, ఇది ప్రజారోగ్యంతో వ్యాపారం చేయడమేనని ఆరోపించారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వెంటనే జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని సహించేది లేదని, ప్రజల ప్రాణాలతో ఆటలాడే ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపాల్సిందేని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు.