సింగరేణి చరిత్రలో సరికొత్త మైలురాయి
బ్లాక్ మైనింగ్ లీజు ఘనంగా విజయోత్సవ వేడుకలు
సత్తుపల్లి జూలై 15 (విజయక్రాంతి): తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజు సాధన విజయోత్సవ వేడుకలు సత్తుపల్లి ఏరియా పరిధిలో అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పట్టుదల, ప్రజా ప్రభుత్వ నిరంతర కృషి ఫలితంగా 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈ బ్లాక్ లీజు మంజూరు కావడంతో సింగరేణి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నేడు ఉదయం 7:00 నుండి 7:30 గంటల వరకు మార్నింగ్ షిఫ్ట్ ప్రారంభ సమయంలో జేవీఆర్ ఓసీ, జేవీఆర్ సీహెచ్పీ, కిష్టారం ఓసీ మరియు జేవీఆర్ డిస్పెన్సరీలలో కార్మికులు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా జేవీఆర్ ఓసీలో పీఓ ఎన్.వి.ఆర్. ప్రహ్లాద్ అధ్యక్షతన జరిగిన వేడుకలకు సత్తుపల్లి ఏరియా జీఎమ్ చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలాగే జేవీఆర్ సీహెచ్పీలో భూక్యా రాంబాబు అధ్యక్షతన ఏరియా ఇంజనీర్ సోమశేఖర రావు, కిష్టారం ఓసీలో పీఓ ఎల్.ఎ.ఎస్.వి. సునీల్ వర్మ అధ్యక్షతన ఎస్‌ఓ టు జీఎమ్ బొల్లం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జేవీఆర్ డిస్పెన్సరీలో డాక్టర్ బి. నరసింహారావు అధ్యక్షతన వైద్య సిబ్బంది ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం సత్తుపల్లి జీఎమ్ కార్యాలయంలో ఏరియా అధికారులందరితో ( హెచ్ ఓ డి ఎస్ ) మరియు కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రధాన విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు.
ఈ చారిత్రాత్మక విజయ పండుగలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులను ఉద్దేశించి పంపిన ప్రత్యేక స్ఫూర్తిదాయక సందేశాన్ని అధికారులు అందరికీ చదివి వినిపించారు. అనంతరం కార్మికులందరికీ డిప్యూటీ సీఎం సందేశం కలిగిన పాంప్లెట్లు మరియు మిఠాయిలను పంపిణీ చేశారు. ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో 45 సంవత్సరాల పాటు సింగరేణికి ఉజ్వల భవిష్యత్తును, తెలంగాణకు ఇంధన భద్రతను ఇచ్చే తాడిచర్ల-2 కేటాయింపుతో పాటు, భవిష్యత్తులో కోయగూడెం, సత్తుపల్లి వంటి మరిన్ని బొగ్గు బ్లాకులను సింగరేణికి తీసుకొస్తామనే డిప్యూటీ సీఎం హామీ పట్ల కార్మిక లోకం హర్షం వ్యక్తం చేసింది.






