26 April, 2026 | 3:26 AM

వచ్చే ఎన్నికల్లో మైనార్టీలకు పెద్ద పీట

26-04-2026 12:56 AM

కవితకు ఆశ ఉండాలి.. అత్యాశ ఉండొద్దు 

ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్నది బీఆర్‌ఎస్సే 

ఎన్ని కొత్త పార్టీలొచ్చినా కాంగ్రెస్‌దే అధికారం 

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ 

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల నుంచి ఎమ్మెల్యేగా గెలవకపోవడం శోచనీయమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. 2028 జరిగే ఎన్నికల్లో మైనార్టీలకు ఎక్కువగా రూరల్ ఏరియాలో టికెట్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. పీసీసీ మైనార్టీసెల్ చైర్మన్‌గా ఇర్ఫాన్ అలీ శనివారం గాంధీభవన్ లో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక మైన పార్టీ అని, మైనారిటీ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. సిక్కు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనార్టీలను మరింత క్రీయాశీలం కావాలన్నారు. 8 మంది మైనారిటీలకు  కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించినట్లు చెప్పారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అనేక అమలు కానీ హామీ లు ఇచ్చి అమలు చేయడం లేదని,  అంబానీ, అదానీ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయ ని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో పేదవాడు పేదవాడిగానే ఉన్నారని తెలిపారు.

భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశాన్ని సమూలంగా చదివారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగుతోందని,  విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. జిల్లాల్లో పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేసి మైనారిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని ఇర్ఫాన్ అలీకి మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. బీఆర్ ఎస్ హయంలో అనేక మంది ఆర్టీసీ కార్మి కులను పొట్టన పెట్టుకున్న పాపం కేసీఆర్‌దన్నారు. ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడ టానికి ఏం అర్హత ఉంది. కార్మికులతో సామరస్య పూర్వంకంగా చర్చలు జరిపి పరిష్కరిం చడం ప్రజాస్వామ్య పాలన లక్షణమన్నారు. 

కవితకు ఆశ ఉండొచ్చు.. కానీ, అత్యాశ ఉండొద్దన్నారు. కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం అభినందనీయమని, కానీ, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన దోపిడిలో కవితకు భాగస్వామ్యం ఉందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే కవిత మౌనంగాఉండి ఆ అక్రమాల్లో పాలుపంచుకున్నారని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారని, ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మరోసారి జయకేతనం ఎగురవేస్తుందని ఆయన స్పష్టం చేశారు.