26 April, 2026 | 4:55 AM

అట్టహాసంగా టీఆర్‌ఎస్ ఆవిర్భావం

26-04-2026 01:07 AM
  1. జన సంద్రంగా మునీరాబాద్
  2. రాష్ట్ర నలుమూలల నుంచి జన సమీకరణ 
  3. కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పైనా కవిత ఘాటు వ్యాఖ్యలు
  4. ‘పాంచజన్య’ ప్రసంగ సమయంలో కార్యకర్తల నుంచి హర్షాతిరేకాలు

మేడ్చల్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ (ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం) లో శనివారం కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో అట్టహాసంగా టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ జరిగింది. కవిత తమ పార్టీ జెండాలో పసుపు రంగును హైలైట్ చేశారు. తెలంగాణ పటాన్ని నీలిరంగులో మలిచారు.

తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ను స్థాపించిన విధంగానే, తమ పార్టీలోనూ అవే అక్షరాలు.. టీ..ఆర్..ఎస్ వచ్చేటట్టు పార్టీని స్థాపించడం యావత్ రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశమైంది. సభ వేదికపై కవిత పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించేటప్పుడు సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. కాంగ్రెస్, బీజేపీపైనే కాకుండా, తన తండ్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పైనా విమర్శనాస్త్రాలు సంధించడం చర్చనీయాంశమైంది.

ప్రసంగంలో ఎక్కువగా కేసీఆర్ వ్యక్తిత్వంతోపాటు పదేళ్ల పాలన మీద విమర్శలు చేయడం హైలైట్‌గా నిలిచింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పెద్దగా ప్రస్తావించలేదనే చర్చ కూడా సాగింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌పై సీరియస్ ఆరోపణలు ఏమైనా చేస్తారనే చర్చ నడవగా, ఆమె వారిపై పెద్దగా ఏ వ్యాఖ్యలు చేయలేదు. కవిత పక్కా ప్రణాళికతో సభ నిర్వహించారు. ఎండల దృష్ట్యా సభను తొందరగా ముగించాలని కవిత భావించారు. అందుకే.. ఉదయం 11 గంటలకే ఆమె తన ప్రసంగం పూర్తిచేశారు.

ఇరకాటంలో బీఆర్‌ఎస్

కవిత తన పార్టీకి టీఆర్‌ఎస్ అని నామకరణం చేయడంతో బీఆర్‌ఎస్ ఇరకాటంలో పడింది. కేసీఆర్ స్థాపించిన టీఆర్‌ఎస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌గా మారిన సంగతి తెలిసిందే. పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత, మళ్లీ పార్టీ పేరు టీఆర్‌ఎస్ పేరే పెట్టాలని కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తున్నది. ఇలాంటి తరణంలో కవిత తన పార్టీకి టీఆర్‌ఎస్ అని నామకరణం చేయడం చర్చనీయాం శమైంది. మరోవైపు, ఈ విషయంలో బీఆర్‌ఎస్ కోర్టును సైతం ఆశ్రయించే అవకాశమూ ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు