మోర్గి మోడల్ స్కూల్ తనిఖీ చేసిన ఎంపీడీవో
విద్యార్థులతో భోజనం చేసి సమస్యలపై ఆరా
నాగలిగిద్ద, జూలై 17: నాగలిగిద్ద మండలంలోని మోర్గి తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని ఎంపీడీవో మహేశ్వరరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన రోజువారీ మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని ఆరా తీశారు.
మెనూ అమలు సరిగా లేదని, తాగునీటి సమస్య ఉందని విద్యార్థులు తెలపడంతో వసతి గృహంలోని వాటర్ ప్లాంట్ను పరిశీలించి వెంటనే ప్రారంభింపజేసి, ఇకపై ఫిల్టర్ చేసిన తాగునీటినే వినియోగించాలని సూచించారు. అనంతరం రికార్డులు, ఆహార నిల్వలు, పాల ప్యాకెట్లను పరిశీలించగా వాటి గడువు తేదీ అదే రోజుతో ముగియనున్నట్లు గుర్తించి, గడువు ముగిసే ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించవద్దని సిబ్బందిని హెచ్చరించారు.
తనిఖీ సమయంలో కేర్టేకర్, వాచ్మన్ గైర్హాజరు కావడంతో కూరగాయల సరఫరా సక్రమంగా లేక మెనూ ప్రకారం వంటలు అందించడం లేదని వంట సిబ్బంది తెలిపారు. అలాగే ఆరుగురు విద్యార్థినులు జ్వరంతో చికిత్స పొందుతున్నారని, ఏఎన్‌ఎం పోస్టు ఖాళీగా ఉండటంతో వైద్య సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అనంతరం ఎంపీడీవో మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్నాక్స్ అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో పాఠశాల ప్రిన్సిపాల్ సువర్ణ, పంచాయతీ కార్యదర్శి సుభాష్ పాల్గొన్నారు.






