05-02-2026 01:57:43 AM
నియోపోలిస్‌లో రెండస్తుల రిజర్వాయర్లపై అధ్యయనం
ఖరీదైన భూమిని ఆదా చేసేలా ప్లాన్
జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టిన భారీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఖానాపూర్, నియోపోలిస్, జన్వాడ ప్రాంతాల్లో పర్యటించి గోదావరి, నియోపోలిస్ నీటి సరఫరా, అమృత్ 2.0 ఎస్టీపీ నిర్మాణ పనుల ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఖానాపూర్‌లో గోదావరి ఫేజ్ 2, 3లో భాగంగా నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
నియోపోలిస్ ప్రాంతానికి సమగ్ర మంచినీటి సరఫరా కోసం చేపట్టిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంపింగ్ స్టేషన్, డబ్ల్యూటీపీకి సంబంధించిన భూ కేటాయింపులపై హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులతో చర్చించారు. నియోపోలిస్‌లో భూమి విలువ అత్యధికంగా ఉన్నందున, స్థలాన్ని ఆదా చేసే సరికొత్త ఆలోచనను ఆయన అధికారుల ముం దుంచారు. ఇక్కడ నిర్మిస్తున్న రెండు 2.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్లను పక్కపక్కన కాకుండా.. ఒకదానిపై ఒకటి ఉండేలా రెండు ఫ్లోర్ల మాది రిగా నిర్మిస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలన్నారు.
అనంతరం జంట జలాశయాల పరిరక్షణలో భాగంగా జన్వాడలోని బుల్కాపూర్ నాలా వద్ద నిర్మిస్తున్న 4 ఎమ్మెల్డీల ఎస్టీపీ పనులను ఎండీ పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే మురుగునీటిని నేరుగా ఈ ఎస్టీపీకి తరలించేలా ట్రంక్ మె యిన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ విషయంలో హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, హైడ్రా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్ ఉపేంద్ర రెడ్డి, జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ శ్రీధర్, జీఎంలు, హెచ్‌ఎండీఏ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.