అబద్దాల సీఎం గద్దె దిగాలి
జూటా పాలనకు కేరాఫ్ రేవంత్ ప్రభుత్వం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కామారెడ్డి లో వరదల వల్ల జరిగిన నష్టం
420 హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం
100 రోజులన్నారు..1000 రోజులు అయ్యింది
ఏడు రోజుల పోరు బాటను విజయవంతం చేయండి
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కాంగ్రెస్ 420 హామీల అమలుకు బీఆర్ఎస్ పోరుబాట
తొలిరోజు ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీ, 420హామీల ఫ్లెక్సీ ప్రదర్శన
కామారెడ్డి, సెప్టెంబర్ 2(విజయక్రాంతి):అబద్దాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దె దిగాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. బుధవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో ఒక్క హామీ మాత్రమే నెరవేర్చారన్నారు. అబద్ధాల సీఎం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
420 హామీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించి అందలమెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్న హామీల అమలులో ఘోరంగా విఫలం కావడంతోపాటు విధ్వంస పాలన కొనసాగిస్తుందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల దగా పాలన నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల పోరుబాట కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కామారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దిన్ నేతృతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ఫ్లెక్సీ ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 420 హామీలను ప్రజలకు ఇచ్చిన మాటగా భావించి వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలో కూడా ప్రతి ప్రజా సమస్యపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
22ఏ భూములపై పోరాటం ఉధృతం
22ఏ నిషేధిత జాబితాలో ఇలాంటి వివాదాలు లేని భూములను చేర్చడం ద్వారా ప్రజల ఆస్తులను అమ్ముకోలేని, కొనలేని పరిస్థితి ఏర్పడుతోందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. 22ఏ పేరుతో ప్రజల ఆస్తులపై విధిస్తున్న ఆంక్షలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.
సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ తదితర సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆరోపించారు. పేదలు, మహిళలు, విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలకు గతంలో అందిన సంక్షేమ పథకాలు ఇప్పుడు సక్రమంగా అందడం లేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పోరాటం
కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి డివిజన్‌లో బీఆర్ఎస్ పోరు బాట కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును వివరించాలని సూచించారు.
పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో బకాయి హామీల కార్డులను సిద్ధం చేశామని, వాటిని నియోజకవర్గంలోని కామారెడ్డి పట్టణ, గ్రామాల్లో వార్డులు, తీసుకెళ్లి ప్రజలకు పంపిణీ చేయాలని నాయకులకు సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం కె.ముజీబుద్దిన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, కౌన్సిలర్ అరకల ప్రభాకర్ యాదవ్, కుంభాల రవి యాదవ్, మామిండ్ల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






