ఉద్యోగం లేక మనోవేదన
మంథని, ఆగస్టు 27 (విజయ క్రాంతి): ఉద్యోగం లేక గత కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న ఓ యువకుడు తువాలుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మంథని మండలంలో చోటుచేసుకుంది. మృతుడు సిద్ధ తిరుపతి (35)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం మంథని మండలం అక్కేపల్లి గ్రామానికి చెందిన సిద్ధ తిరుపతి గ్రామం సింగరేణి పరిధిలోకి వెళ్లడంతో ప్రస్తుతం పోతన కాలనీలోని తన అత్తారింట్లో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై, మానసికంగా కలత చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న తిరుపతి తువాలుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున భార్య ఇంటి వెనుక వైపు డోర్‌లోంచి చూడగా తిరుపతి ఉరివేసుకుని కనిపించాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురై చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తిరుపతిని కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది.
మృతుడు తిరుపతికి భార్యతో పాటు ఐదేళ్ల కుమారుడు, ఐదు నెలల పాప కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్య, ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంథని సీఐ ప్రసాద్‌రావు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.






