లిఫ్ట్ అడిగి యువకుడిపై దాడి.. కత్తితో బెదిరించి నగదు దోపిడీ
ఆరుగురు నిందితుల అరెస్ట్ – ఫోన్లు, కత్తి స్వాధీనం
జవహర్‌నగర్,(విజయక్రాంతి): అంబేద్కర్ నగర్‌లో లిఫ్ట్ అడిగిన వ్యక్తి ద్వారా యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగదు దోచుకున్న ఘటనను జవహర్‌నగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం... జూలై 31 రాత్రి 8.30 గంటల సమయంలో అంబేద్కర్ నగర్‌లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పద్మారావు అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగిన ఓ యువకుడు కొంతదూరం వెళ్లిన అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే ఉన్న మరో ఐదుగురు కలిసి బాధితుడిని కత్తితో బెదిరించి, రూ.5,000 నగదును దోచుకున్నారు. అంతేకాకుండా బాధితుడి మొబైల్ ఫోన్ ద్వారా గూగుల్ పే ద్వారా మరో రూ.800 బదిలీ చేయించుకున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నమ్మదగిన సమాచారం ఆధారంగా అత్తాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి ఒక కత్తి, వివో Y21, వివో 1610, ఒప్పో K12, శాంసంగ్ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
అరెస్టైన నిందితులు:
మహమ్మద్ సుబాన్ అలియాస్ ఎం.డి. ఫయాజ్ (19)
మహమ్మద్ అజీజ్ (21)
షేక్ వహీద్ (22)
మహమ్మద్ సోహెలుద్దీన్ (21)
మీర్ ఉనయత్ అలీ (24)
సయ్యద్ అబ్రాహ్ (21)






